పుట:Kavijeevithamulu.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

238

కవి జీవితములు

వాకిలికావలి తిమ్మన్నపైని జెప్పిన పద్య శేషము.

ఒకానొకదినంబున రాయలు తనవాకిలికావలిగా నున్న తిమ్మన్న యనునొకదండనాయకునియెడల నతనిశౌర్య విశేషమునకుగా సంతసించి యతని కొక విలువ గలపట్టుపచ్చడమును (సేలును) బహుమాన మిచ్చెను. అట్టి బహుమానము నాతఁ డంది తనయింటికివచ్చి వీథియరుఁగు పయిఁ గూర్చుండెను. అంతట నావీథినే, అల్లసాని పెద్దన్న, ముక్కుతిమ్మన్న, భట్టుమూర్తి, రామకృష్ణుఁడును బోవుచుండి రాయనికడ బహుమానము నంది వచ్చియున్నతిమ్మనదండనాయకునిఁ జూచి తమ సంతోషముంగూడ నాతనికిం దెలుపుకోరికెతో నతనికడఁ గొంతసేపు కూర్చుండి యతనిని మాటలతో నలరించిరి. అపుడు వారిలోఁ పెద్దన యొక పద్యముఁ జెప్పెడుతలంపున :-

క. వాకిటి కావలితిమ్మా

అనుడు - ముక్కుతిమ్మన్న లేచి

ప్రాకటముగ సుకవివరులపాలిటిసొమ్మా

అనుడు, భట్టుమూర్తి లేచి

నీ కీపద్దెము కొమ్మా

అనెను. అంత రామకృష్ణుఁడు లేచి :-

"నా కాపచ్చడమె చాలు నయముగ నిమ్మా"

అని పూర్తిచేసెను. తిమ్మనదండనాయకుఁ డాపద్యమున కెంతయు నలరి యందలితుదిభాగములో భావప్రకటన చేసినరామకృష్ణునకుఁ దాను బహుమానముగ నందివచ్చినపచ్చడ మిచ్చి తక్కినవారికి మఱి కొన్ని బహుమానముల నిచ్చి పంపెను.

ఇట్లింకను రామకృష్ణునివిశేషములం దెల్పుగాథలు పెక్కులు చెప్పంబడును. ప్రస్తుతము నాకు లభ్యమైనవానిలో రసికులు మెచ్చఁదగినట్టియు, పండితులకు శ్రవణయోగ్యము లగునట్టియు, నీరసములు కానట్టియుఁ గొన్నిగాథల వివరించితిని. తెనాలిరామకృష్ణునికథ లను నామముతో నొప్పునవి పామరజనమనోరంజకములుమాత్రమే గానవాని నిందుఁ జేర్పక రామకృష్ణుఁడు కేవలము పండితుఁడుగా నుండిపండితులతోఁ జేసినసంవాదవిశేషములనే చేర్చి వక్కాణించుట యయినది.