పుట:Kavijeevithamulu.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెనాలి రామకృష్ణకవి.

237



శరీరము నలియఁబెట్టకుండుట. ఇఁక నాల్గవనీతి యెట్లనఁగా; - మిగుల గయ్యాళి గాక యుండుట. అనఁగాఁ గొంతవఱకైనను గయ్యాళి గానిచో నాఁడుది కాఁపురము చేయఁజాలదు గనుక నామట్టుకు గయ్యాళిగా నుండవలయు ననియు నంత కధికముగా గయ్యాళి కాఁగూడ దనియు దీనియర్థము. అను రామకృష్ణునిపల్కులకు సభ్యులు రాజును విశేషధ్వనితో నవ్వందొడంగిరి. గ్రంథకర్త డగ్గుత్తిక దోఁప ముందరిచరణముం జదువలేకయుఁ జదివిన నిఁక నది యెట్లుగా నుపన్యసింపఁబడునో? అనుభీతిచేత నోరు మెదపక యూరకుండెను. రాయఁడును గ్రంథకర్తయొక్క యట్టినిశ్చేష్టితవ్యాపారములఁ జూచి సదయుం డై "రామకృష్ణుని పూర్వపక్షము లట్లే యుండును గావున సందియంబు వలదు. గ్రంథము మాకందఱకు నాదరణపాత్రము కాకపోదు" అనిపల్కి తద్గ్రంథకర్తకుఁ దగుబహుమానంబు లొనర్చి సాగం బనిచెను.

పంచతంత్రపద్యకావ్యవిషయము.

కృష్ణరాయని బావమఱఁది యగు "బైసరాజువెంగళరాజు" అను నఁత డొకగొప్పయాంధ్రకవి. ఇతఁడు పంచతంత్రిని బద్యకావ్యముగా నొనరించిన వారిలో నొకఁడు, తనగ్రంథము సంపూర్తియయినతోడనే వెంగళరాజు దానిని రాయలసభలోనిపండితులకు వినిపింపగోరి రాయనికిం దెల్పిన మంచిది యని పల్కెను. ఇట్లసుజ్ఞాతుండై పైకవి తనశపథములుగా గ్రంథపఠనమునకు ముందుగఁ గొన్ని మాటలం దెల్పెను. అందు మొదటిది తనకవిత్వమం దెవ్వరైనం దప్పు పట్టినచోఁ దన నాలుకం గోసికొనుట. రెండవది. తప్పులేకుండఁ దనగ్రంథములోఁ దప్పున్నట్లుగా నేరైనఁ జెప్పి రేని యట్లక్రమముగాఁ జెప్పినవారినాలుకం గోయుట. అనునిట్టిధూర్తనృపబంధుశపథంబులు విని కోపించి రామకృష్ణుండు లేచి

"ఈరాచకవిత్వబాధ పడరాదు గదా యెటువంటివారికిన్"

అని చెప్పి సభ వదలి వచ్చెను అతని వెంబడినేతక్కినపండితులును లేచి నిలువంబడిరి. అట్టిపండితులయుద్దేశముల నారసి రాయఁ డాగ్రంథమును మఱియొకతఱి వినుపింపవచ్చు నని గ్రంథకర్తకుం దెల్పి యానాఁటికి సభ చాలించెను.