పుట:Kavijeevithamulu.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

180

కవి జీవితములు



తరవాగ్వైఖరి మెఱయ నాగ్రంథమును జదువ నారంభింప నందు నారదుఁడు శ్రీకృష్ణసాన్నిధ్యమునకు వచ్చి పారిజాతసుమం బిచ్చిన వృత్తాంతంబును పిమ్మట సత్యభామ నాతఁడు నిందించుటయును సాత్రాజితికిఁ గల్గినకోపకారణమును శ్రీకృష్ణుఁ డాపెకుఁ గోపోపశమనము సేయుటయుఁ జదివి భర్తయెడ నాయింతికి గోప ముడుగకున్న నారమాభర్త :-

"ఉ. పాటలగంధిచిత్తమునఁ బాటిలుకోపభరంబుఁ దీర్ప నె
    ప్పాటను బాటు గామి మృదుపల్లవకో మలతత్పదద్వయీ
    పాటలకాంతి మౌళిమణిపంక్తికి వన్నియ వెట్ట నాజగన్నా
    టకసూత్రధారి యదునందనుఁ డర్మిలి మ్రొక్కె మ్రొక్కినన్.

అని చదివి పిమ్మటఁ దనయభిప్రాయము తేటపఱుప నిట్లనియె.

"మ. జలజాతాసన వాస వాది సుర పూజా భాజనం బై తన
     ర్చులతాంతాయుధుకన్న తండ్రిశిర మచ్చో వామపాదంబునం
     దొలఁగం ద్రోచె లతాంగి యట్ల యగు నాథుల్ నేరము ల్సేయఁ బే
     రలుకం జెందినయట్టికాంత లుచితవ్యాపారము ల్నేర్తురే."

అని చదివి దానికి విశేషదృష్టాంతములు దెల్పుచు సరసంబుగ స్త్రీలు కోపించి యొనరించెడివృత్తాంతములఁ జెప్పి యప్పట్టున మఱలఁ గోపించక శ్రీకృష్ణుఁ డెట్లుండెనో చూచితిరే యని :-

"చ. నను భవదీయదాసుని మనంబున సెయ్యపుఁగిన్కఁ బూని తాఁ
    చినయది నాకు మన్ననయ చెల్వగునీపదపల్లవంబు
    మత్తనుపులకాగ్రకంటకవితానము సోఁకిన నొచ్చు నంచు నే
    ననియెద నల్క మానవు గదా యిఁక నైన సరాళకుంతలా."

అనునీపద్యమును జదివెను. తోడనే రాయనికిఁ దనమనంబున స్వకీయవృత్తాంతము జ్ఞప్తికి వచ్చి తా నిట్టిసమయమున నడిచినవిధమంతయు విరసముగఁ గాన్పింపఁ దనలోఁ దా నిందించికొనుచు "కృష్ణుఁడు లోకారాధ్యుఁ డయ్యును గోపించి తన్నినభార్యయెడ నెట్లు వర్తించెనో చూడుఁడు. కృష్ణునట్టిరసికుఁ డుండవలదా. అవ్వలివృత్తాంతము చదువుఁడు" అనుడుఁ దిమ్మన తనతంత్రము కార్యకారి యయ్యె నని లోన ముదితుండై మీదివృత్తాంతము చదివి సత్యభామ కృష్ణున కిచ్చినయుత్తరము లని యిట్లనియె :-