పుట:Kavijeevithamulu.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నందితిమ్మన.

181

"క. మానంబే తొడవు సతులకు, మానమె ప్రాణాధికంబు మాన మఖిలస
    న్మానములకు మూలం బగు, మానరహిత మైనబ్రదుకు మానిని కేలా."

అనుదీనిని రసపుష్టి చేసి యన్వయించి చెప్పిన విని రాజు బలే నీచెప్పిన దంతయు మేలుగ నున్నది. అనంతరవృత్తాంతముఁ జదువు మనుడు నాయాశ్వాస మంతయు ముగించెను. అంత సూర్యా స్తమయన మయమయినది.

అపుడు రాయఁడు పండితులం జూచి నేఁటికి నాస్థానమును జాలింత మని వారలకు సెల వొసఁగి తా నంతఃపురికి వచ్చి దాసీజనమును గాంచి కేళికాధామ మలంకరింప నాజ్ఞ యొసంగెను. వార లతిసంభ్రమ మునం జని రాజ్ఞి కవ్వార్తఁ దెలిపిరి. ఆయమ యానందాబ్ధిమగ్నయై వారికిఁ గనకాంబరాభరణము లొసంగినది. ఱేఁడు నాఁటిరేయి భార్యా ద్వితీయుఁడై సుఖముగ నుండెను. రాజమహిషి మఱునాఁడు వేకువ నవ్వార్త రహస్యముగఁ దిమ్మనకు నొక చెలికత్తెచేఁ బంచినది. దాని విని యాతఁడు నత్యాంతానందంబు నందెను.

కృష్ణరాయలు పారిజాతాపహరణవృత్తాంతము విని యున్న వాఁడు గావున నందలికథాసందర్భము మనమునకు వింత దోఁపింప భార్యను బిలిచి యాపెతో నిట్లనియె. "ముక్కుతిమ్మన చేసిన పారిజాతాపహరణములోనికథాసందర్భము కల్పితమై యుండును. అట్లు గాకున్నఁ గృష్ణుఁడు తనభార్యకుఁ గోపముతీఱుపం జనినను ఆపె తన్నిన నూరకుండుట నిజముగఁ గల్గునా? ఇట్టిచిత్రవృత్తాంత మెపుడైనను జరుగునా ? అనుడు నాపె నవ్వి పురుషులు కాలానుసారముగఁ గార్యములు నడిపెదరు దీనియాథార్థ్యము కాలాంతరమున మీకే గోచరం బగు నని యప్పటికి నూరకుండెను.

పిమ్మట నారాజపత్ని తనచమత్కారమును బురుషులకక్కుఱితియును గనుపఱుప నొకయుపాయ మారయం దొడంగినది. అంతఁ దన దాసీజనములో బిన్నవయసున నున్నట్టిరూపలావణ్యాతిశయముల నొప్పునట్టియొకజవరాలిం దెచ్చి తనయాభరణము లుంచి దాని నలంకరించి