పుట:Kavijeevithamulu.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

132

కవి జీవితములు



డ నని యుఁ జెప్పికొనినచోఁ దనకవిత్వము సంప్రదాయశుద్ధ మని లోకమునకుం దెలియు ననియుం జెప్పెను. ఎట్లన్నను :- నిర్వచనోత్తర రామాయణములోని :-

గీ. సారకవితాభిరాము గుంటూరివిభుని, మంత్రిభాస్కరు మత్పితామహునిఁ దలఁచి
   యైనమన్ననమెయి లోక మాదరించు, వేఱె నాకృతిగుణములు వేయు నేల.

అనుపద్యముంబట్టి సోమయాజి నిర్వచనోత్తర రామాయణమును రచించుటకుఁ బూర్వము కవిత్వసంప్రదాయమునకు విశేషముగఁ బ్రసిద్ధి కెక్కినభాస్కరుఁ డనునొకకవి యుండె నని యూహింప వలసి యుండును. అట్టివారిలో రామాయణమును దెనిఁగించినభాస్కరుఁడు తప్ప మఱెవ్వరును భాస్కరులు గానరారు. ఇందుచేత నీతఁ డే తిక్కనసోమయాజి వక్కాణించినభాస్కరుఁ డని యూహింతము.

2. ఇంతియ కాక తిక్కన సోమయాజి యుత్తర రామాయణమును దెనిఁగించుటకుఁ గారణము నీతనిమనుమఁ డగుటచేతనే యని తోఁచెడిని. రామాయణముయొక్క పూర్వభాగము తిక్కనతాతచే రచియింపఁబడినచోఁ దిక్కన యాగ్రంథమంతయుఁ బూర్తి సేయుటకు యత్నించుట లెస్సయై యుండునుగదా. అపుడు రామాయణ మంతయు వారి వంశజులచేతనే తెనిఁగింపఁబడె ననుఖ్యాతి గల్గును. అట్టిసంబంధ మేది యేని లేనిచో నొరులు రచించినగ్రంథ శేషమునే తిప్కన తెనిఁగింప నుత్సహించుట గలుగదు. భారత మెట్లు తెనిఁగించి రంటిరో దానికిఁ గారణాంతరము లున్నవి.

3. భారతములోఁ దెలఁబడిన యీక్రిందిపద్యము పైయూహలను మఱికొంత బలపఱచుచున్నది. ఆపద్య మెద్ది యనిన భారతమువిరాట పర్వములో :-

"సీ. మజ్జనకుండు సన్మాన్యగౌతమగోత్ర, మహితుండు భాస్కరమంత్రితనయుఁ
    డన్న మాంబాపతి యనఘులు సింగన, మల్లన సిద్ధనామాత్యవరుల
    కూరిమితమ్ముండు గుంటూరివిభుఁడు కొమ్మనదండనాథుండు మధురకీర్తి."

అని యున్నది. దీనింబట్టి భాస్కరునకు నల్గురుకొడుకు లనియు వారినామములు సింగన, మల్లన, సిద్ధన, కొమ్మన యనియు నుండెను.