పుట:Kavijeevithamulu.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

122

కవి జీవితములు

ఇట్లు వీరు సంభాషించుచుండ సూర్యోదయం బయ్యెను. అపుడు సాళ్వగుండ నరసింహనృపాలుఁడు సభామండపంబునకు విచ్చేసి నిండోలగం బుండి పినవీరనరాక నిరీక్షించుచుండెను. అప్పుడు ముందు పెదవీరనయు నాతనియనంతరము పినవీరనయు వచ్చి యథోచితస్థానంబులఁ గూర్చుండి గ్రంథంబు పరిసమాప్తి యయ్యె నని తెలిపిరి. దానిని విని రాజు మిగుల సంతసించి దానిం జదువు మనియెను. అపుడు పెదవీరన కథారంభంబుమొదలు గ్రంథాంతమువఱకును జదివెను. దానిని విని పండితులు పినవీరనసరసతకు నెంతయు సంతసిల్లి యీక్రింది పద్యంబును మరలఁ జదివిరి. అదియెద్ది యనిన:-

సీ. అమృతాంశుమండలం బాలవాలము గాఁగ, మొలిచె నొక్కటి జగన్మోహనముగఁ
   జిగిరించే విలయసింధుగతకైతవడింభ, శయనీయవరపలాశములతోడఁ
   బితృ దేవతలకు సంచితసత్త్రశాలయై, చెట్టు గట్టెను గయా క్షేత్రసీమ
   నిలువ నీడయ్యె నిందీవరప్రియకళా, కొటీరునకు భోగికుండలునకు

గీ. మఱ్ఱిమాత్రంబె పిల్లలమఱ్ఱిపేరు, పేరువలెఁగాదు శారదాపీఠకంబు
   వారిలోపలఁ బినవీరువాక్యసరణి, సరసులకు నెల్లఁ గర్ణరసాయనంబు.

అనుడు భళిరే ! మీవచించున దింత యొప్పునే. ఈతఁ డిట్టివాఁ డ యగును. ఈతనివంశము నట్టిదయ. ఈతని కల్పన లెట్టివో చూచితిరే.

ఉ. "అల్లన విచ్చు చెంగలువలందురజంబును గప్పురంబు పైఁ
    జల్లఁగ జల్లనై వలచుసౌరభమున్ వెద చల్ల భావముల్
    బల్లవహస్తచన్నుఁగవపయ్యెదజిమ్ముగఁ దోఁచుభాతిగాఁ
    బిల్లలమఱ్ఱివీరన యభిజ్ఞుఁడు సెప్పఁగ నేర్చు కల్పనల్."

అని చెప్పి యీకవికి బహుమానం బీతనియిష్టానురూపంబుగ నిచ్చుట మేలని యితఁ డాశ్వాసాంతమందుఁ జెప్పిన :-

క. ప్రేమమున శ్రోత వక్తకుఁ "జామీకరహయము ధవళచామరములు నా
   నామణివిభూషణంబులు, గ్రామము కృపసేయవలయు" గ్రంథసమాప్తిన్.

అనుపద్యానుసారంబుగ నిచ్చి భూపాలుఁడు బహూకరించెను.

ఇట్టిబహుమతుల నంది యీతఁ డుండఁ బండితు లందఱును గ్రంథంబు స్వల్పకాలంబున ముగియించుట యత్యాశ్చర్యంబు.అది యెట్లు ముగించితి రని ప్రశ్నంబు సేయఁ బినవీరన వాణి నారాణియె