పుట:Kavijeevithamulu.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పిల్లలమఱ్ఱి పినవీరభద్రయ్య.

121



బునఁ గన్నుంచి లోపలివృత్తాంతంబు గన్గొనుచో నొకసుందరాంగి సర్వాభరణభూషితై యొకచేతఁ బైఁడిఘంటంబు పట్టి యింకొక చేత పుస్తంబు వట్టిశరవేగంబున వ్రాయుచున్నట్లు గాన్పించెను. పినవీరన యచ్చో నున్న మంచంబుపైఁ బవ్వళించి నిద్రించుచున్నట్లు చూపట్టెను. ఇట్టిచూపున కద్భుతం బందియుఁ బెదవీరన యాపెఁ బద్మభవుని రాణిగ నెఱుంగలేక సామాన్యభావంబుచేఁ జూచుచుండఁగా దీనిని గ్రహించి విరించిరాణి తనఘంటం బాతనికంటం బడ విసరినది. దానిచే నాతఁ డొకబొబ్బ వేసి భూమిపయిం బడుడుఁ బినవీరన్న లేచి వచ్చి యేమికారణం బనుడు నాతఁడు తనకన్నుం జూపెను. అపు డాతఁడు వెఱవకు మని లోపల వ్రాయుటచే రాలినతాటాకుపొడిఁ దెచ్చి యాతనికంటిలో నుంచి కొంతసేపు కట్టి విప్పినతోడనే మఱల నేత్రం బెప్పటి యట్లు కాన్పించెనఁట.

ఇట వాణి త న్నన్యుఁడు వీక్షించుటంజేసి యచ్చో నుండ నొల్లక యంతర్హిత యయ్యెను. వీరన మిగిలినభాంగంబు సంపూర్తిచేసి దానితుదిని :-

సీ. పరఁగఁగ మల్లమాంబకుమారునకు పోన, మకులాంబునిధిపూర్ణి మావిధునకు
   భరతకీర్తికిఁ దులాపురుషాదిదానాంబు, జంబాలితాస్థాన సౌధునకును
   పరరాజభీకరధరణీవరాహున, కాత్రేయగోత్రపవిత్రునకును
   గుండయనరసింహమండలేశ్వరునకు, నభ్యుదయపరంపరాభివృద్ధి

గీ. కరముగా భారతీతీర్థగురుకృపాస, మిద్ధసారస్వతుఁడు సత్కవీంద్రసఖుఁడు
   కుకవిమూర్ధవిలుంతనకులిశహస్త, పల్లవుఁడు చెప్పెఁ బినవీరభద్రసుకవి.

అని వ్రాసి గ్రంథంబు ముగించి దానిని వదినెతో విన్న వించి మాయన్న తో దీని నాస్థానంబునఁ జదువఁ జెప్పు మని ప్రార్థించెను. ఆపె తనభర్తతో మఱఁదియభీష్టంబు తీరుటకు నాస్థానంబునకుఁ జనుండని మనవి యొనరించినది. అతఁడును తమ్ముఁడు నాసమీపంబున నున్న నే దీనిం జదివెదఁ గాని లేకున్న నే నిద్దానిని ముట్ట ననియెను. ఆమాట విని పినవీరన తానును వచ్చెద నని సమ్మతించెను.