పుట:Kavijeevithamulu.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పిల్లలమఱ్ఱి పినవీరభద్రయ్య.

123



యుండ నేమి లోపంబు ? దీని నొకదినంబులోపలఁ బూర్ణంబుసేసితి, ననియె. "వాణి నారాణి" యని నిశ్శంకతోఁ బల్కినవీరనంగని మీరు వాణి నా రాణి యని పల్కెదరు గాఁబోలును ? అనుడు వీరన నవ్వి "వాణి నారాణి" యని కంఠోక్తిగాఁ బల్కెను. ఆమాటకుఁ బండితు లందఱును గనలి నీ వెంతవిద్వాంసుండవై యున్నను నిర్భయంబుగ నిట్టిమాట లాడఁగూడదు. జగన్మాత యగువాణి నితఁడు తనరాణి యని పలుక సభ్యులు తగునుత్తర మీక యూరకుండఁ జనదు. ఇట్టివాఁడు పండిత మాని గాని పండితుఁడు గాఁడు, అని సభ్యులొక్క పెట్టఁ బలుకఁ దొడంగిరి. అపు డంతరిక్షంబున నుండి యొక యశరీరవాణి గర్జారవంబున సభ్యుల నుద్దేశించి యిట్లనియె :-

"వాణి జగంబునకు మాత. ఇతనికిమాత్రము భార్య యగును. ఇతఁడు చతురాననుని యవతారము. కావున నీసంశయం బింక వదలుం"డని పలుక వారందఱును నద్భుతం బంది యాతని నెంతయు గారవించిరఁట! ఇట్టి వృత్తాంతము లిప్పుడు చెప్పెడివారికిని వినువారికిని నద్భుతంబులు పుట్టించుటకు సంశయంబు లేదు. అయిన నాతనిచారిత్రమునకు వలయుప్రధానవృత్తాంతంబులు మనకుఁ దెలిసిన వివియే కావున వాని నిట వ్రాసితిని.

గ్రంథకథావిషయము.

ఈగ్రంథములోనిధర్మజుని యశ్వమేధవృత్తాంతము భారతములో నున్నది. దానినే జైమినిముని యింకొకవిధంబునఁ జెప్పినట్లున్నది. ఇందలికథలు కొన్ని భారతంబునఁ గానరావు. ఈకవి రచియించినపర్వ మిది యొక్కటియే. రాజు కోరినదియు నింతమట్టు కే అయినట్లు గ్రంథారంభము తదంతంబుం జూడ గోచరం బగును. ఈకవిశైలి మృదు వగునది యైనను నన్వయ కాఠిన్యముమాత్ర మించుక కలదు. ఈతనిపదశయ్యాదులు రసస్ఫూర్తియుఁ దిక్కనసోమయాజి కవనంబుంబోలె సరసంబై యుండును. ఇట్టి సామ్యంబుఁ జూడఁగోరినచో భారతంబులో నశ్వమేధ పర్వంబున నున్న సమా నేతిహాసంబులు చూడఁదగును.

భారతాంధ్రకవులచరిత్రము ముగిసెను.