పుట:Kavijeevithamulu.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పిల్లలమఱ్ఱి పినవీరభద్రయ్య.

113

మ. కవులన్ బంకజగర్భసన్నిభుల వక్కాణింతు వల్మీక సం
    భవునిన్ వ్యాసునిఁ గాళిదాసు బిలహున్ బాణున్ ముయూరున్ శకున్
    భవభూతిన్ శివభద్రు మల్హణుని ఘంటామాఘునిం జోరు భా
    రవి మానన్న యభట్టుఁ దిక్కకవి నేఱాప్రగ్గడన్ సోమునిన్.

అనుపద్యములోని "మా" అనుదానింబట్టి చూడ నన్న యభట్టును పినవీరనయొక్కవంశమువారును నొక్కగోత్రమువా రై యుందురనియుఁ జెప్ప నొప్పి యున్నది. నన్న యభట్టుది భారద్వాజసగోత్రము కావునఁ బినవీరనగోత్రమును నదియే యని యూహింప నై యున్నది.

జైమినిభారతరచనావిషయము.

ఇందువిషయమై లోకమునఁ గలప్రతీతిని గధాసందర్భములో వివరించెదను. కాని యితనిగ్రంథములో వక్కాణింపఁబడిన వృత్తాంతము ముఖ్యముగ నమ్మఁదగియుండు నని యెంచి దాని నీక్రింద వివరించెదను. ఎట్లన్నను :-

"ఆ రాజపరమేశ్వరుండు (సాళ్వగుండ నరసభూపాలుఁడు) ఒక్క నాఁడు ........... యర్హాసనసమాసన్న రాజన్యశిరఃప్రసవవాసనా ముద్రితం బైనభద్రాసనంబునఁ బేరోలగం బుండి పురాణేతిహాసకథాప్రసంగంబుల వినోదించుచు :-

క. నా మది నిరతము భారత, రామాయణకథలఁ బ్రేమ రంజిలు నందున్
   జైమినిభారత మనఁగా, భూమి నపూర్వము పురాణముల గణియింపన్.

గీ. ఆపురాణంబుఁ గనఁ దెనుఁగయ్యనేనిఁ, జెప్ప నేర్చినకవియుఁ బ్రసిద్ధుఁడేని
   తెనుఁగు నుడికారమున మించుఁ గనియె నేని, కుందనముకమ్మ వలచినచందమగును.

వ. అని సభాసదులమొగంబులు చూడ నవధరించిన నా రాజసత్తముచిత్తం బెఱింగి వారిట్లని విన్నఁ వించిరి.

క. ఏరీతి నెఱిఁగెనో పిన, వీరన దేవరతలంపు విఖ్యాతము గాఁ
   బేరును బె ట్టిదియును దన, పేరుగ రచియింపఁ బూనెఁ బేశలఫణితిన్.

క. అని విన్న పంబుఁ జేసిన, ననుఁ గనుఁగొని యలరి నాథనంబు ఋణము గాఁ
   దినక యుపార్జించె యశో, థన మిటు గావలదె యాశ్రితత్వం బనుచున్.