పుట:Kavijeevithamulu.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

114

కవి జీవితములు

క. దరహాసరసముఁ దాంబూ, లరసముఁ గప్పురపుఁబల్కులం గుంకుమపూ
   బెరసినగతిఁ దోపఁగఁ సా, దరముగ నిట్లనియె భారతజ్ఞులతోడన్.

ఉ. అల్లన విచ్చు చెంగలువలందురజంబును గప్పురంబుఁ బైఁ
   జిల్లఁగఁ జల్లనై వలచుసౌరభముల్ వెదఁజల్లుభావముల్
   పల్లవహస్తచన్నుఁగవపయ్యెదజీబుగఁ దోఁచుభాతిగాఁ
   బిల్లలమఱ్ఱివీరన యభిజ్ఞుఁడు చెప్పఁగ నేర్చుఁ గల్పనల్

వ. అని సమీపంబునఁ గొలిచియున్న నన్నుం గృపాతరంగితాసాంగంబున విలోకించి మామక మనోరథు బెఱింగినట్లు చెప్ప నుద్యోగించితివి హృద్యానవద్యగద్యపద్యామ బంధంబు గాఁ బ్రబంధం బంధ్రబాషను జైమినిభారతంబునం దశ్వమేధపర్వంబు నిర్విఘ్నంబుగా రచియింపు మని యానతిచ్చినఁ బ్రసాదం బని యంగీకరించితిని".

అని యున్నది. ఈపైపద్యములు పినవీరనను రాజు అతని గ్రంథరచనకై ప్రేరేపించకపూర్వమే జైమినిభారతగ్రంథరచన చేయుచుండెనని తెల్పుటయేకాక అతని కవిత్వమునందుఁ గలవిశేషములను భావస్ఫుటము చేయుటయందుఁ గలసామర్థ్యాదులంగూడఁ జూపును. అందులో "నల్లన విచ్చు చెంగలువ" లనుపద్యములోఁ జెప్పినవిధముగ నీతనికవిత్వము, వినిన మాత్రనే హృదయాహ్లాదకర మనియునుఁ దెల్పఁబడియె. ఇట్టికవిత్వములోఁగూడఁ గథానుసారమైన కాఠిన్యములు కొన్నిచోట్లఁ గానుపించును. ఎట్లైనను మెట్టున నీపినవీరభద్రుఁడు ముక్కుతిమ్మన మొదలగు వారివలె మిక్కిలి మృదుమధురవాక్కులు గలకవిగా నెన్న వలసి యుండును. ఇతఁడు శ్రీనాథునికంటెఁ గొంచెము చిన్న వాఁ డై యున్నట్లు గాఁ గనుపించును. ఆవివరము శ్రీనాథునికవిత్వముతోఁ జూపి యుంటిని గావున నావిషయమై యిందు విశేషించి వ్రాయక లోకము వాడుకనుబట్టి యితనికవిత్వమహత్త్వాదుల నీక్రిందిభాగములో వివరించెదను.

లోకమువాడుకంబట్టినపినవీరభద్రయ్య చర్యలు.

ఇతఁ డాకాలపుఁ బండితులలోఁ బ్రసిద్ధుఁడు. మిక్కిలి బాలుం డై వీథులలో నాడుకొనుచున్న సమయమందు నీతనిప్రతిభావిశేషంబులు పండితులకు నచ్చెరువుఁ బుట్టించుచుండును. ఇట్టిసమయంబుననే