పుట:Kavijeevithamulu.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

88

కవి జీవితములు



సోమయాజికుమారుం డగుమారనకవి మార్కండేయపురాణముం దెనిఁగించి ప్రతాపరుద్రదేవునిమంత్రి యగునాగయగన్నమంత్రికిఁ గృతి యిచ్చినట్లుగాఁ జెప్పంబడి యున్నది. అందులోనే మఱియొకచోఁ బైనిఁ జెప్పినమారనకవి సోమయాజికుమారుండు కాఁడనియును, మఱియొక తిక్కనామాత్యునికుమారుం డనియును, నొకానొక రనిరి గాని దాని కాధార మేదియుఁ గానరా దని యుండెను. కాని యాగ్రంథములోని సందర్భము చూచినమాత్రముననే మారనకవి సోమయాజికుమారుఁడు కాఁడని స్పష్టముగ నూహింప నయ్యెడిని. తిక్కనసోమయాజికొమారుని పేరు మారన యని వాసిష్ఠరామాయణకవివలనం గాని, మఱియేయితరగ్రంథమువలనం గాని, తిక్కనసోమయాజికృతంబు లగుగ్రంథములవలనం గాని కాన్పింపదు. జ్ఞానవాసిష్ఠరామాయణాంధ్రకవి తనవంశముం గూర్చి వ్రాసికొనుచోఁ దనతాత యగునల్లాడమంత్రి తిక్కనసోమయాజిపౌత్రుఁ డగుగుంటూరికొమ్మవిభునికూఁతుం బరిణయ మయ్యె నని చెప్పి యుండెను. దీనివలన సోమయాజి కొక్కకుమారుఁ డున్నట్లు తెలియుచున్నది. కాని యతనిపేరేమో తేలలేదు. ఇఁక మార్కండేయపురాణములోనియాశ్వాసాంతపద్యములో నున్న సందర్భముంబట్టి చూడ నం దుదాహరింపఁబడినమారనకవి తిక్కనసోమయాజికుమారుఁడు కానట్లు స్పష్టమే యగుచున్నది. అందులో :-

"శ్రీమదుభయకవిమిత్ర తిక్కనసోమయాజిప్రసాదలబ్ధసరస్వతీ పాత్ర తిక్కనామాత్యపుత్త్ర మారయనామధేయ ప్రణీతము?

అని యున్నది. దీనింబట్టి మారనకవి తిక్కనసోమయాజిపుత్త్రుండు గాక అతనిశిష్యుం డగుతిక్కనామాత్యునిపుత్రుం డని స్పష్ట మగు చున్నది. కావునఁ దిక్కనసోమయాజి కుమారునిపేరు మనకుఁ దెలియ లేదు. ఇటులఁ దెలియనిదానికై ప్రయత్నము మాని అతనిసంతతి వారిలో నెవ్వరిపేళ్లు వసిష్ఠరామాయణకవివలన వివరింపఁబడినవో వానిం జూపుదము.