పుట:Kavijeevithamulu.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తిక్కనసోమయాజి.

89

తిక్కనసోమయాజికిని వసిష్ఠ రామాయణ కవి యగుసింగనకును గలసంబంధము.

పైగ్రంథములోఁ జెప్పఁబడినయొకపద్యమువలన నీకథ యంతయు స్పష్టము కాఁగలదు. కాఁబట్టి ఆపద్యమును దెలిపెదను. అందు సింగనకవి తనతాత యగునల్లాడమంత్రింగూర్చి వ్రాయుచు నీక్రిందివిధంబుగ వివరించెను. ఎట్లన్నను :-

సీ. అతఁడు దిక్కనసోమయాజులపౌత్త్రుఁ డై, కొమరారుగుంటూరికొమ్మ విభుని
   పుత్త్రి బిట్టాంబిక బుధలోకకల్పక, వల్లి వివాహమై వైభవమున
   భూసార మగుకోటభూమి కృష్ణానదీ, దక్షిణతటమున ధన్యలీల
   నలరురావెల యనునగ్రహారముఁ దన, కేకభోగంబుగా నేలుచుండి.

గీ. యందుఁ గోవెలఁ గట్టి గోవిందు నెన్న, గోపినాథుప్రతిష్ఠయుఁ గోరి చేసి
   అఖిలవిభవంబునందున నతిశయిల్లె, మనుజమందారుఁ డల్లాడమంత్రివిభుఁడు.

అనునీ పద్యములోఁ బౌత్త్రుఁడని వ్రాసినచోఁ బుత్త్రుఁ డని పాఠాంతర ముండిన నుండవచ్చును. ఆంధ్రదేశస్థులలోఁ దఱుచుగఁ దండ్రిపేరు కొడుకుల కుంచుట స్వభావముగా నున్నది. తిక్కనసోమయాజి తండ్రిపేరు కొమ్మన పైపద్యములో వివరింపఁబడినతిక్కనసోమయాజి సంబంధి యగునతనిపేరును గొమ్మనయే అచ్చుప్రతులలోఁబౌత్త్రుఁడని పుత్త్రునకే పడియున్నఁ బడియుండును. ఈమార్పువలనఁ బద్యములోన గణ భంగము కాదు. కాఁబట్టి, ఆభాగమును "తిక్కనసోమయాజులపుత్త్రుఁడై కొమరారుగుంటూరికొమ్మవిభుని" అని సవరించిన లెస్సయైయుండును. అట్లే సవరించి చదువఁగా దిక్కనసోమయాజికిఁ గుమారుఁడు గుంటూరికొమ్మన యనియు, పౌత్త్రి బిట్టాంబిక యనియును, ఆమెకు నల్లాడమంత్రివలన నయ్యలమంత్రి యనుకుమారుఁడు కల్గె ననియును, నాయయ్యలమంత్రి కుమారుఁడు వసిష్ఠ రామాయణగ్రంథకర్త యగుసింగనమంత్రి యనియుం దేలినది. ఇంతకు నధిక మగుగ్రంథములు దొరకకుండుటచేతఁ దిక్కన సోమయాజికుమారునివంశముంగూర్చి వివరింపఁబడ దయ్యెను. దేశాభిమాను లీవిషయము నింకను శోధింతురుగాక, సోమయాజికృత