పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

8

దు. గురుజాడ శ్రీరామమూర్తిగారును, రావుబహదరు కందుకూరి వీరేశలింగము పంతులుగారును దాము రచియించిన కవిజీవితములలో నీప్రతీతినే యవిమర్శముగా గ్రహించినారు. దీనికి బలముగా

మ. ఘనుఁడ న్వేములవాడవంశ జుఁడ దాక్షారామభీ మేశనం
     దనుఁడన్ దివ్యవిషామృతప్రకటసా నా కావ్యధుర్యుండ భీ
     మననా పేరు వినంగఁ జెప్పితిఁ గళింగాధీశ కస్తూరికా
     ఘనసారాదిసుగంధవస్తువులు వేగందెచ్చి లాలింపురా.

అను చాటుపద్య ముదాహరింపఁబడినది. కాని, భీమకవి గోదావరీమండలములోని వాఁడు కాఁ డనియు, గోలకొండదేశములోని వేములవాడగ్రామమునకు సంబంధించినవాఁ డనియు నా యభిప్రాయము. ఈ వేములవాడ పూర్వము వెలిగందలజిల్లా యనియు నిప్పుడు కరీంనగరం జిల్లాయనియుఁ బేర్కనిన మండలమందున్నది. దీనికి లేములవాడ యనియు, లేమలవాడయనియు నామాంతరములు గలవు. ఆగ్రామమందున్న కొన్ని శాసనములలో "లేమ్బలవాడ” యనుపేరు గనఁబడుచున్నది. " లేమ్బల” క్రమముగా లేమల, లేముల, వేముల యయి యుండవచ్చును. ఈ గ్రామమున కరకోసు దూరములో నామపల్లి యను నొక యూరు గలదు. నామపల్లియు వేములవాడయుఁ గలిసి పూర్వ మొక పెద్దపట్టనముగా నుండె ననియు, నచట రాజరా జను రాజు రాజ్యముచేసెననియు, నా కాలమునందువేములవాడలో లేమలు (భోగస్త్రీలు) నివసించుటచే నాగ్రామమునకు లేమల