పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మన ముసల్మానులు భారతీయులు కారా?

81

హిందూ మహమ్మదీయ గాయకులు పాడే పాటలలో రాధాకృష్ణ శృంగార గీతములు, రామభజన కీర్తనలు, శివతత్త్వములు, మహమ్మదీయ సూఫీగీతములు, అల్లా నుద్భోదించే తరంగాలూ ఎట్టి మతభేదమూ లేకుండా పాడతారు.

పా ట లు, ప దా లు

సంగీత విద్యలోలాగనే ప్రజలు పాడుకునే సామాన్యమైన గాలిపాటలలోనూ పదాలలోనూ హిందూమహమ్మదీయ జనసామాన్యము ఇప్పటికీ ఒకే విధమైన పాటలూ, పదాలూ పాడతారు. ఉత్తర హిందూస్థానంలో హిందూ మహమ్మదీయుల పండుగలలోనూ, బాలబాలికల పుట్టినరోజుపండుగలలోనూ, పెళ్లిళ్లలోనూ స్త్రీలు ఒకేవిధమైనపాటలు పాడతారు. పిండి విసిరేటప్పుడు, బరువులు మోసేటప్పుడు, పడవలు లాగేటప్పుడు, ఇళ్ళ డాబాలమీద సున్నమునకు జిగి రావడానికి కొట్టేటప్పుడు, ఇంకా నలుగురు కలిసి కాయకష్టం చేసే అన్ని సందర్భాలలోనూకూడా మన దంఫుళ్ళపాటలు, రోకంటిపాటలు, పడవపాటల లాంటి పాటలనే అక్కడ కూడా పాడుతూ వుంటారు. ఇందులో హిందూ మహమ్మదీయ భేదము లేనే లేదు.

బీహారు పరగణాలలోనూ ఉత్తర హిందూస్థానములో అనేక ప్రాంతాలలోనూ ముసల్మానుల ఇళ్లల్లో పాడే జోలపాటలు 'నంద్ లాల్ ' అని శ్రీకృష్ణున్ని ఉద్దేశించి వ్రాయబడిన హిందువుల పాటలే! కృష్ణుని శ్యామ లవర్ణమునే 'శాన్ వాల్య ' అనే పదముగా మార్చి పాడుతూవున్నట్లు పరిశోధకులు కనిపెట్టినారు. *ఇలాగే బీహారు లోనూ ఉత్తరదేశ పరగణాలలోనూ మహమ్మదీయ స్త్రీలు పాడే పెళ్ళిపాటలు కూడా హిందువులవే. ఉదాహరణానికి ఈ క్రిందిపాటచూడండి.

అల్బెలీ జచ్చా మన్ కరే నంద్ లాల్ సే
సోహగన్ జచ్చా మన్ కరా నంద్ లాల్ సే
అల్బేలీ నీ ముఝే దర్ ద్ దియా
శాన్ వాల్యానే ముఝే దర్ ద్ దియా.