పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/69

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

62

కథలు గాథలు

చెప్పే నాల్గవ వేదంలోని మతధర్మాలను గురించి వారికి బోధించడానికే తాను దేశంగాని దేశాన్నుంచి ఇంతదూరం వచ్చాననిన్ని చెపుతూ నోబిలీ ప్రజలకు బోధించడం ప్రారంభిచాడు.

ఈ కొత్తపద్ధతి క్రైస్తవమతప్రచారము అతి చమత్కారంగా వున్నదనిన్ని, తాను క్రైస్తవులుగా చేయదలచిన ఈ హిందువుల మత విశ్వాసాలలోనూ, సిద్ధాంతాలలోనూ గల గట్టి ఘట్టాలనూ, లోపాలనూకూడా ఈ నోబిలీ ఎంతబాగా గ్రహించాడో దీనివల్ల బాగా తెలుస్తూవున్నదనీ మాక్సుమూలరుగారు వ్రాశారు.

'ఎక్సోడస్ ' అనే పుస్తకంలో తన ప్రచార పద్దతినిగురించి నోబిలీగారే ఇట్లు వ్రాశారు. "హిందువుల దేవుళ్ళు పనికిమాలిన వారైనా వారిని దూషించకూడదు. ఆ దేవుళ్ళను దూషిస్తే దానివల్ల మనకు లాభం కలిగేటందుకుబదులు నష్టం కలుగుతుంది. ఒక గదిలోనుంచి చీకటిని తొలగించాలంటే చీపుళ్ళు పుచ్చుకొని దులిపి కాలం వ్యర్ధపరుస్తామా? ఒకదీపం వెలిగిస్తాము. చీకటి దానంతట అదే మాయమవుతుంది. స్నేహంచేత క్రైస్తవేతరుడి హృద;యాన్ని ఆకర్షించాలి. అతనికి మనయందు భక్తివిశ్వసాలు కలుగచెయ్యాలి. తరువాత అతనికి సత్యమనె దివ్వెను ఇవ్వాలి. అంతట విగ్రహారాధనమనే అంధకారము చిక్కులు లేకుండా మాయమౌతుంది."

ఇంకొక ఉత్తరంలో తాను చేసే బోధను నోబిలీ వర్ణించాడు. "నా దగ్గరకు వచ్చినవాళ్లకందరికీ భగవంతు డొక్కడేననిన్నీ, ఆయన క్రైస్తవులునమ్మే మూడు మూర్తులలో సాక్షాత్కారం అవుతున్నాడనిన్నీ, ఆయనఅ నంతుడనిన్నీ, భూమండలమును మనుష్యులను సర్వ జంతువులను సృష్టించిన వాడనిన్నీ, మానవులను రక్షించేటందుకు మానవ శరీరాత్మలతో ఒక దివ్య కన్యాకుమారి కడుపున పుట్టినాడనిన్నీ, ఇలాగ పుట్టిన అవతారమూర్తి ఏసుక్రీస్తు అనిన్నీ, ఇతడునిర్వికారుడనిన్ని, మానవులపాపముల నన్నింటినీ తాను భరించిన రక్షకుడనిన్ని చెప్పి ఆ మత ధర్మాలను బోధించేవాడు.