పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చక్రవర్తికి శిక్షవిధించిన దివానులు

37

సం॥ మార్చి 29 తేదీన ఆయనకు యావజ్జీవఖైదు విధించారు. ఆ తీర్పునుబట్టి కంపెనీవా రాయనను రంగూనులో నిర్భంధించి యుంచగా ఆయన 1862 వ సంవత్సరం నవంబరు 7 వ తేదీన దివంగతుడైనాడు.

1765 లో మొగలు చక్రవర్తివల్ల దివానుగిరీని పొందినది మొదలు 1857 వరకూ ఇంగ్లీషు కంపెనీ వారు దేశపరిపాలనమంతా చక్రవర్తిపేరుకిందనే జరిగిస్తూ వచ్చారుగాని తాము స్వతంత్రప్రభువులమని ఎన్నడూ ప్రకటించ లేదు. క్రమక్రమంగా చక్రవర్తికి చేయవలసిన మర్యాదలను తగ్గించినా వారు బహిరంగముగా చక్రవర్తిని పదచ్యుతుని చేయలేదు. బహుదూరుషా చక్రవర్తి రాజ్య పరిత్యాగమున్నూ చేయలేదు. అందువలన ఆయనను తమన్యాయ స్థానం యెదుట పెట్టి శిక్షించే టప్పటికి కూడా ఇంగ్లీషు ప్రభుత్వము చక్రవర్తికి ప్రతినిధులుగా వ్యవహరిస్తూ వున్న తాబేదారీ వ్యవస్థగానే ఉన్నది. కంపెనీవారు చక్రవర్తికి ప్రతిసాలునా చెల్లిస్తూ యున్న సొమ్ము (పించను) ఉపకారవేతనమని వారు చెపుతూవున్నా ఆదిలో అది కప్పంగా వుడినందువల్లదానిస్వభావం మారలేదు. ఇంగ్లీషు కంపెనీవారు చక్రవర్తిని త్రోసిరాజన్నమాత్రంచేత దేశానికి స్వతంత్రప్రభువులు కారు. అందువల్ల దివానులుగా పనిచేస్తూ వున్న సేవకులే చక్రవర్తికి శిక్షవేసి నట్లేనని కొందరు విమర్శించారు. పైగా ఎంత చెడ్డా మొగలురాజు స్వతంత్రరాజు. అంతర్జాతీయ న్యాయశాస్త్రధర్మము ప్రకారము ఆయన సామాన్యన్యాయస్థానముల అధికారిమునకు లోబడిన సామాన్య వ్యక్తి కాదు. అందువల్ల ఇంగ్లీషు న్యాయస్థానము వా రాయనకు విధించిన శిక్ష న్యాయమైనదిన్నీ చెల్లతగినదిన్నీ కాదని కొందరు ధర్మశాస్త్రజ్ఞలు విమర్శించారు. ఏమైతే నేమి? బలవంతులైన ఇంగ్లీషువారి చర్యను ఎవరు కాదనగలరు? అందువల్ల చెల్లిపోయింది. మొగలాయి చక్రవర్తి నిర్భంధములో వుంటూనే 1862 లో చనిపోయినాడు.