పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/40

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

32

కథలు గాథలు

కాలంలో ఇంగ్లీషువారు షా ఆలం చక్రవర్తికి తా మివ్వ వలసిన సొమ్మును ఇవ్వకుండా బిగబట్టారు. 1788 లో రోహిలాల నాయకుడైన గులాంఖాదిర్ ఢిల్లీని పట్టుకుని షాఆలం చక్రవర్తి గ్రుడ్లు పీకివేశారు. తరువాత మహారాష్ట్రరాజ్యసమ్మేళనములో నొక రాజైన సింధియా యీ అంధచక్రవర్తిని మళ్ళీ ఢిల్లీ సింహాసనము మీద కూర్చుండబెట్తి కీలుబొమ్మలాగ ఆడించడం ప్రారంభించాడు. ఇంగ్లీషు వర్తక కంపెనీ వారు మహారాష్ట్రులతో, యుద్ధము చేసిన సందర్భములో 'లేకు ' సేనాని ఢిల్లీ నగరాన్ని పట్టుకుని 1806 లో షాఆలం చక్రవర్తిని మళ్లీ ఇంగ్లీషు కంపెనీవారి సంరక్షణలో ఉంచగలిగారు. ఐతే అంధుడైన ఈ ముసలి పాధుషా 1806 వ సంవత్సరం నవంబరు 10 వ తేదీన చనిపొవడంతో ఆయన బాధలు తీరినవి.

పూర్వపు మర్యాదలు

ఆంగ్లేయ వర్తకకంపెనీ యుద్యోగులును వారి అధికారులును గవర్నరులును కూడా మొదటి రోజులలో మొగలాయిచక్రవర్తిని నవాబులునుకూడా దాసాను దాసులై ఎంతో భయభక్తులతో ప్రవర్తించేవారు. వారికి జోహారులుచేయడము నజరులు సమర్పించడము వారి యెదుట నిలిచియుండడము మొదలైన పూర్వపు మర్యాదలనన్నిటినీ చాలాకాలంవరకూ పాటించేవారు. వాస్కోడాగామా కళ్లికోటరాజైన జామొరిన్ పాదముల దగ్గర మోకరించియుండిన చిత్రము, జహంగీరు చక్రవర్తి దర్బారులో ఇంగిలీషురాజు రాయబారియైన సర్ తామస్ రో నిలిచియుండడము, షాఆలంచక్రవర్తి అలహాబాదులో కొలువు దీర్చి యుండగా క్లైవు నిలిచియుండడము మొదలైన పటములు ఆకాలమునాటి మర్యాదలను ప్రదర్శిస్తున్నవి. కంపెనీ యుద్యోగులు మొదలు గవర్నరు జనరలు వరకును తుదకు సీమలోని డైరక్టర్లవరకును గల వారందరూ మొగలుచక్రవర్తి గారికిని నవాబులకును వ్రాసే ఉత్తరాలలో వారి వారి బిరుదావళిని యుదాహరించి యెంతో వినయము తోను నమ్రతతోనూ చేసిన విన్నపము లిప్పటికిని కంపెనీవారి కవిలెలలో నున్నవి.