పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/41

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

చక్రవర్తికి శిక్షవిధించిన దివానులు

33


1711 లో కలకత్తా విలియంకోట ప్రెసిడెంటు (గవర్నరు)గానుండిన ఇంగ్లీషు వర్తకకంపెనీ యుద్యోగి వంగరాష్ట్ర నవాబుగారికి అతివినయముగా దాసోహముచేసి "ఏలినవారి సేవకే అంకితముచేయబడిన నాప్రాణములను తమ పాదముల సన్నిధిని ఉంచుచున్నాను" అని వ్రాశాడు. ఇతడే రెండేళ్ల తరువాత ఫరుక్ షయ్యరు చక్రవర్తిగారికి వ్రాయుచు "ఏలినవారి సేవకుడును, అత్యల్పమైన ఇసుకరేణువును అగు తూర్పు ఇండియావర్తకకంపెనీ ప్రెసిడెంటు జాన్ రస్సెల్ తననుదుటిని నేలపైన మోపి చేయుమనవి" అని తాను సాష్టాంగప్రమాణమును చేయుటను ఆ ఉత్తరములో సూచించినాడు.

ఆరోజులలో ఇంగ్లీషు వర్తక కంపెనీవారును వారితాబేదారులును మొగలాయి చక్రవర్తులకును వారి రాజప్రతినిధులకును అడుగులకు మడుగులొత్తి అతి వినయముగా ప్రవర్తించుచు వారిని దర్శించి నప్పుడు రొక్కపునజరులను సమర్ఫించి వారిని తృప్తిపరచి ఫర్మానాలను సంపాదించేవారు.

చాలా కాలంవరకూ గవర్నరులు, గవర్నరు జనరలులు కూడా మొగలాయి చక్రవర్తుల ఎదుట నిలచి యుండవలసినదేగాని కూర్చుండుటకు వీలులేదు. వారన్ హేస్టింగ్సు గవర్నరుజనరలుగా నున్నప్పుడు (1774-85) ఢిల్లీ చక్రవర్తి ఏనుగుపైన హౌదాలో కూర్చుండగా తాను ఆయన వెనుకగా కూర్చుండ వలసి వచ్చినది.

1813 లో హేస్టింగ్సు గవర్నరు జనరలు అగునప్పటికి ఆంగ్లేయుల పలుకుబడిన్నీ బలమున్నూ హెచ్చినందువల్లను మొగలు చక్రవర్తి చాలా బలహీనుడై మహారాష్ట్రుల చెప్పుచేతలలో నున్నందువల్లను చక్రవర్తి హేస్టింగ్సు నొకమారు రమ్మని కోరినప్పుడు అతడు వెళ్లడాని కెంతో జాగుచేసి తుదకు చక్రవర్తి తో సమానముగా కుర్చీలో కూర్చుండే గౌరవమును పొందగలిగాడు.