Jump to content

పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

152

కథలు - గాథలు

కంపెనీవారు భూస్వామిత్వపు హక్కులను నిర్ణయించి శాశ్వత పైసలా (పర్మనెంటు సెటిల్మెంటు) చేసే సందర్భంలో నూజివీడు జమీందారీని గురించి నరసింహప్పారావుగారి పెద్దభార్యాకుమారునికీ చిన్న భార్యాకుమాళ్ళకూ గల తగాదాలు పరిష్కరించడం కోసం వెంకటనరసింహారావుగారికి నిడదవోలు పరగణాలు, రామచంద్ర అప్పారావుగారికి వుయ్యూరు పరగణాలు యిచ్చి పేష్కషు బకాయి వదులుకొని సన్నదులిచ్చి జమీందారీని 1803 లో వారికి వశపరిచారు. పైసందర్భంలో హెడ్జెసుగారి బాకీని చెల్లించవలసినట్లు కంపెనీ అధికార్లు నిర్ణయించలేదు. వారికి చెప్పనూలేదు.

ఇలాగ నూజివీడు జమీందార్లకు కొత్తపట్టా యిచ్చిన తరువాత మళ్లీ ముప్ఫై సంవత్సరాలు జరిగిపోయినవి. అప్పుడు అందరికీ ఆశ్చర్యం కలిగేటట్లుగా హాడ్జెసుగారి ఋణశేషం తగాదా మళ్ళీ త్రాచుపాము లాగ తలయెత్తింది. సంగతి యేమిటా అని ఆలోచిస్తే అప్పట్లో సీమలో పలుకుబడిగల దొరలు కొందరు యేకమై ఈ బాకీని రాబట్టి పంచుకొని అక్రమలాభం పొందాలనే దురుద్దేశ్యంతో దీనిని బయటికి తీసినట్లు తేలింది.

ఈబాకీ అనేది సర్వాబద్ధ మనిన్నీ చెల్ల దనిన్నీ ఇవ్వ నక్కరలేదనిన్నీ కంపెనీవారు గట్టిగా వాదించారు గాని, బాకీని రాబట్టడానికి నడుముకట్టిన దొరలు చాలాబలవంతులై నందువల్ల ఈ వ్యవహారం ఇంగ్లాండు పార్లమెంటులోకి యెక్కింది. ఇది ప్రభువులసభలో చర్చకు వచ్చింది.

సంగతిసందర్భాలు చూసేవారికి ఈబాకీ అనేది అబద్ద మనిన్నీ అక్రమమైనదనిన్నీ తోచినా బలవంతులైన తెల్లదొరల పలుకుబడి వల్లను మొహమాటంవల్లను ఈబాకీ యిచ్చుకోవలసినదే నని ప్రభువుల సభవారు 1832 లో తీర్మానించారు.[1]

____________

  1. Manual of the Kistna District pp.110-112, 298-301. The History of the British Empire in India - Edward Thomson (1842) Vol.II pp.243-246