పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నూజివీటి వ్యవహారం

151


తీసుకొన్న విషయాన్ని గురించి విచారణచేస్తూ చెన్నపట్నం కార్యాలోచన సంఘమువారు వృద్దజమీందారుగారిని సాక్ష్యము యివ్వడానికి 1789 లో చెన్నపట్నానికి పిలిపించారు. ఆయన అక్కడ కొద్ది రోజులలోనే మరణించారు.

అప్పారావుగారి బాకీవ్యవహారం యింకొకమాటు తలయెత్తి వూరుకుంది.

తూర్పు ఇండియా డైరెక్టర్ల సభలో ముఖ్యుడున్నూ, పార్లమెంటువారు హిందూదేశవ్యవహారాలను తనిఖీచేయడానికి ఏర్పరచిన బోర్డులో సభ్యుడున్నూ అయిన రైట్ ఆనరబుల్ జాన్ సల్లిషన్ అనే ఆయనకున్నూ కొంతకాలం మచిలీ బందరులో కంపెనీ అధికారిగావుండి తరువాత కొద్దిరోజులు చెన్నపట్నం గవర్నరు గా కూడా పనిచేసిన వైట్ హిల్ అనే ఆయనకున్నూ ఇంకా మచిలీ బందరులో పనిచేసిన మరి కొందరు దొరలకున్నూ తనకున్నూ కలిసి అప్పటి నూజివీటి జమీందారుడైన నరసింహ అప్పారావుగారు కొన్ని లక్షలరూపాయలు బాకీ వున్నారనిన్నీ, ఆ బాకీని తాను రాబట్తుకొవడానికి ట్రాన్సుఫరు పొందివున్నట్లున్నూ, తనకు స్వయంగా కూడా ఒక పత్రంపైన ఆ జమీందారు బాకీఉన్నట్లున్నూ బనాయిస్తూ హాడ్జెస్ తగాదా చేశాడు.

అప్పారావుగారు తనకు పత్రంని వ్రాసినట్లు చెప్పే తేదీన అప్పారావుగారు నిర్భంధంలో వున్నందువల్లను కారాగారాధికారి హాడ్జెస్ గారే గనుకను, ఈ హాడ్జెస్ తనను బలవంతం చేసి ఒక పత్రం వ్రాయించుకొన్నాడని యింకొక జమీందారుగారు 1785 లో ఫిర్యాదు చేసిన సందర్భమున్నూ చూస్తే ఈ హాడ్జెస్ ఎంతటివాడో ఈబాకీ ఎంతవరకూ నమ్మతగినదో త్రెలుస్తుంది.

ఈ హాడ్జెను 1794 లో చనిపోయాడు. 1801 సంవత్సరం దాకా అతని భార్యా అతనికి రావలసిన అప్పుమాట తలపెట్టనేలేదు. అప్పుడు ఆ బాకీ తనకు యిప్పించవలసినదని కంపెనీ డైరెక్టర్ల కోర్టువారికి అర్జీ యిచ్చుకుంది. ఈ అర్జీని కంపెనీ డైరెక్టర్లు నమ్మక త్రోసివేశారు.