143
కథలు - గాథలు
పన్నులు యావత్తు సదాశివరాయలవారున్నూ రామరాయలవారున్నూ తీసివేసినట్లుకూడా, చిట్టాలందుర్గము జిల్లాలొ 1546 లోని ఒక శాసనంవల్ల కనబడుతున్నది.
సదాశివరాయలవారు స్వయంగా ఊటుకూరులోని మంగళ్ళ పైని పన్నులు తీసివేశారు. రామరాయలవారున్నూ కర్ణాటక రాజ్యంలోని కొన్ని మండలాలలోనూ, కడపజిల్లాలోని కొన్ని సీమల లోనూ మంగళ్లపైని పన్నులు తొలిగించారు.
రాయలవారిని చూసి వారి మంత్రులూ సామంతులూ కూడా అనేక గ్రామాలలో మంగళ్లపైని పన్నులు తీసివేశారు . (The Aravidu Dynasty --Heras pp. 48-49)
__________________
13. నూజివీటి వ్యవహారం
1771 లో నూజివీటి జిమీందారుడైన నరసింహ అప్పారావు గారు చాలా ఖర్చు మనిషి. చెన్నపట్నం ఇంగ్లీషు కంపనీ ప్రభుత్వానికి చెల్లించవలసిన కప్పం(పేష్కసు) సరిగా చెల్లించలేకపోయేవాడు. అందువల్ల చిక్కులలో పడ్డాడు.
జమీందారీని వశపర్చుకోవడానికి కంపినీ సర్కారువారు 1773 లో బందరులో ఒక సైనికదళం పంపారు. అప్పుడు ఆయన అత్యధికమైన వడ్డీరేటుతో బందరులో నున్న కంపెనీదొరల దగ్గరనే కొంతసొమ్ము బదులు చేసి బకాయి చెల్లించాడు.
1775లో బందరు కంపెనీవారి పరిపాలనసంఘానికి అధ్యక్షుడుగా నుండిన వైటుహిల్లుకు, హాడ్జెసుకు, ఇంకా బందరులో కంపెనీ ఉద్యోగం చేస్తూవున్న మరికొందరు దొరలకు నరసింహా అప్పారావు గారు బాకీ వున్నారనీ వాళ్ళు 1775లో తగాదా ప్రారంభించారు. మూడు సంవత్సరాలు గడిచినవి గాని వ్యవహారం తెగలేదు. అంతట అప్పారావుగారు చెన్నపట్నానికి ప్రయాణం కట్టారు.