Jump to content

పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

118

కథలు - గాథలు

హోదాలతో నియమింపబడతారు. వీరు పూర్వము మన దేశములో రాణులకు చెలికత్తెలు, పరిచారికలు మొదలైనవారు చేసే సేవలే చేస్తారు. అందువల్ల మన వాకిటికావలి తిమ్మన గారు లార్డుచేంబర్లేను వంటి గొప్ప రాజోద్యోగి అవడానికి సందేహంలేదు.

'అమరం' తిమ్మరసయ్య

సేలంజిల్లా అరగలూరు గ్రామ దేవాలయంయొక్క దేవాదాయాన్ని వసూలు చేసి గుడిపనులు జరిగించే స్థానికు లనే గుడిపారుపత్తెగార్లు ముగ్గురికి కొన్ని యిబ్బందులు కలిగి వాటినిగురించి కృష్ణదేవరాయలవారికి స్వయంగా చెప్పుకొందామని వారు రాజధానీనగరమైన విద్యానగరానికి వెళ్ళారు. అక్కడ రాయలవారి ద్వారమువద్ద నుండే ప్రధానోద్యోగియైన 'అమరం ' తిమ్మరసయ్య గారు వీరిని రాయలవారి దగ్గరికి తీసికొనివెళ్ళి దర్శనం చేయించి వారి యిబ్బందు లను తొలగింప జేయడమేగాక వారి కొక హారము, తలపాగ, గుఱ్ఱము, గొడుగున్నూ బహుమతి చేయించాడట. ఈ సంగతి శా.శ. వర్షమ్లు 1441 కు సరియ్హైన ప్రమాధిసంవత్సరము (క్రీ.శ. 10-6-1519) నాటి శాసనంలో ఉదాహరింపబడివున్నది.

ఈ 'అమరం 'తిమ్మరసయ్యగారు మన వాకిటి కావలితిమ్మన్న గారే యనడానికి సందేహం లేదు. 'అమర ' మనగ పాళెపట్టుదొరల కియ్యబడు కొలది సీమ యని శబ్దరత్నాకరకారులు అర్ధం చెప్పి కుమార ధూర్జటి విరచితమైన కృష్ణరాజవిజయంలోని ఈ క్రింది పద్యాన్ని వుదాహరించారు.

గీ. "భటులు వేయిటి కెన్న నిర్వదియునాల్గు
    వేలుగా లక్షయిర్వదివేల ప్రజకు
    జెల్లు నల్వదిలక్షలు జీత మనఘ
    యమర మేలెడు దొరల కీక్రమము సుమ్మి."

ఈ పద్యంవల్ల 'అమరం ' అనేది కొంత జీతం, బత్తెము, సైనిక బలము, జమీను గల ఒక గొప్ప హోదా అని రూఢి అవుతూవుంది.