పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/114

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

చెన్నపట్నం గవర్నరు దుర్గతి

107


సాధారణసంఘసభలో దీనిని గురించి తీవ్రమైన చర్చ జరిగినది. పిగట్టు గారి అధికారాన్ని ధిక్కరించిన సభ్యుల చర్యను ఖండిస్తూ అతనిని గవర్నరుపదవిలో పున:ప్రతిష్టచేసినట్లు తీర్మానిస్తూ అతని యొక్క ప్రవర్తనను గురించి విచారించ గలందులకుగాను అతనిని చెన్నపట్నం గవర్నరు పదవి వదిలి సీమకు రావలసినదని తీర్మానించారు. చెన్నపట్నం కార్యాలోచన సభలో పిగట్టుగారిపక్షం అవలంబించిన వారినీ ఆయనకు వ్యతిరేకంగా నున్నవారినీ కూడా సీమకు రమ్మని వుత్తర్వుచేసేటట్లున్నూ శిఫారసు చేశారు. ఈ తీర్మానాలకు 317 మంది వ్యతిరేకులుగానూ, 414 మంది అనుకూలంగానూ సమ్మతులిచ్చారు.

పిగట్టుగారి మరణం

అంతట 1777 వ సంవత్సరం మే 21 వ తేదీన పిగట్టుగారి వ్యవహారం ఇంగ్లాండు దేశపు పరమోన్నత శాసనసభ యైన పార్లమెంటులో కామన్సు సభవారి యెదుట చర్చకు వచ్చింది. అప్పుడు కొందరు పిగట్టుగారికి అనుకూలమైన తీర్మానాలను ప్రతిపాదించగా ప్రభుత్వ మంత్రులు వాటిని ప్రతిఘటించారు. అంతట అవి ఓడిపోయినవి ఇట్టిస్థితిలో డైరెక్టర్ల కోర్టు సాధారణ సంఘసభవారి తీర్మానాలను అమలులో పెట్టడానికి డైరెక్టర్ల కోర్టువారు 30-7-1771 వ తేదీన తీర్మానించారు. అయితే ఈ లోపుగానే 11-5-1777 వ తేదీన పిగట్టుగారు దివంగతులైనారు. అందువల్ల పిగట్టుగారి బాధలన్నీ తీరిపోయినవి.

పిగట్టువారికి పెళ్లిలేదు. ఆయనకు ఒక ఉంపుడుకత్తె వుండేది. ఆమెవల్ల అతనికి చాలామంది పిల్లలు కలిగారు. ఆయనకు శాస్త్రీయమైన వారసులు లేనందువల్ల ఆయన వంశమూ ప్రభుబిరుదమూ కూడా బేవారసీ అయిపోయి అంతరించినవి.

పిగట్టుగారు చచ్చిపోయిన రెండు సంవత్సరాలకు ఆయనకు జరిగిన అన్యాయాన్ని గురించిన వివరాలు ఇంగ్లాండులో కంపెనీ అధికారులకూ పార్లమెంటువారికీ బాగా తెలిసినవి. చెన్నపట్నంలో ఆయన కార్యాలోచన సభలో నుండి ఆయనను ప్రతిఘటించి తుదకు ఆయనను ఖైదుచేసిన సభ్యులలో ఒకడైన స్ట్రాటనుగారు ఇంగ్లాండు పార్లమెంటులో