పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

100

కథలు గాథలు

ఉన్నందువల్ల తంజావూరు రైతుల మొరలను ఆలకించి అక్కడ జరుగుతూవున్న అక్రమాలను విచారించి న్యాయం జరిగించేవారే లేకపోయారు.

గ వ ర్న రు పి గ ట్టు గా రు

తంజావూరు రాజుకుజరిగిన అన్యాయం సంగతి మెల్లిమెల్లిగా ఇంగ్లాండులో నున్నతూర్పు ఇండియా వర్తకసంఘంవారి అధికారులకు తెలిసించి. అంతట కంపెనీ డైరెక్టర్లు నవాబుచేసిన అక్రమానికి చెన్నపట్నంలో కంపెనీ అధికారులు మద్దతుచేయడం బాగాలేదని వారిని కఠినంగా మందలించి అప్పట్లో చెన్నపట్నం గవర్నరుగా నుండిన వించ్ (Winch) దొరను ఆపదవిలోనుంచి తొలగించి అతని స్థానే పూర్వం 17855 మొదలుకొని 1763 వరకూ చెన్నపట్నం గవర్నరుగా నుండి ఫ్రెంచివారితో జరిగిన యుద్ధాలలో ధైర్యంగా పనిచేసిన 'జార్జి పిగట్టు ' అనే ఆయనను మళ్ళీ చెన్నపట్నానికి గవర్నరుగా నియమించి తంజావూరు రాజ్యాన్ని మళ్ళీ పూర్వపురాజుగారివశం చెయ్యవలసిందని అతనికి చెప్పి 1775 లో పంపించారు.

ఇది కర్నాటకనవాబుగారికి చాలా కష్టంగాతొచించి. తాను ఇంగ్లీషువారికి నమ్మిన స్నేహితుడననిన్నీ తంజావూరు రాజు వట్టి పనికిమాలిన వాడనిన్నీ తంజావూరు తన అధీనం తప్పితే తాను దొరల కివ్వవలసిన ఋణాలను తీర్చలేననిన్నీ ఎన్నోవిధాలుగా మొరపెట్టుకున్నాడు గాని పిగట్టుగారు వినిపించుకో లేదు. చెన్నపట్నంలోనున్న గొప్పగొప్ప ఉద్యోగులచేత చెప్పించి చూశాడుగాని లాభం లేక పోయింది. ఆఖరికి తాను మళ్ళీ ఇంగ్లాండులో కంపనీ డైరెక్టర్ల సభవారికి చెప్పుకుంటాననిన్నీ అందాకా తంజావూరు విషయంలో చర్యతీసుకొవద్దనిన్నీ పిగట్టుగారిని వేడుకున్నాడుగాని అందుకు కూడా ఆయన అంగీకరించలేదు. తనకీ వ్యవహారంలో సహాయంచేస్తే అమిత మైన ధనం లంచమిస్తానని కూడా నవాబు కబురంపగా పిగట్టుగారు చలించలేదు. నవాబుకి అమితమైన కోపంవచ్చింది. ఈ పిగట్టుగారిని ఎలాగైనా సాధించాలని ఉపాయాలు ఆలోచించడం ప్రారంభించాడు.