Jump to content

పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

98

కథలు - గాథలు

సింహుడు ఇంగ్లీషువారి పక్షాన్నే వున్నాడు. ఇలాంటి స్థితిలో పదభ్రష్టుడైన సాహూజీ మహారాజు తాను మళ్ళీ తంజావూరు సింహాసనం ఎక్కడానికి గనక తనకు సహాయముచేస్తే తంజావూరు రాజ్యంలోనున్న దేవికోటజాగీరునున్నూ, కోటనున్నూ ఇస్తాననిన్నీ, యుద్ధపు ఖర్చులన్నీ తానే భరించు కుంటాననిన్నీ, ఇంగ్లీషువారితో బేరం పెట్టాడు. అంతట ఇంగ్లీషువారికి నోరూరింది. ఇంతవఱకూ తమకు స్నేహితుడుగా నున్న ప్రతాపనరసింహరాజుపట్ల మిత్రద్రోహం చెయ్యడానికి పూనుకొనినారు. అతని మీదికి దండు పంపించారు. అయితే ఆ యుద్ధంలో వారి సైన్యమేఓడిపోయింది. అంతటితో నానాజీకి సహాయంచేసే ప్రయత్నం మానుకొని ఏవిధంగానైనా దేవికోటనుమాత్రంప్రతాపనసింహుని దగ్గర నుంచి లాక్కోవాలనె సంకల్పంతో ఇంగ్లీషువారు దేవికోటను ముట్టడించి అది స్వాధీనంకాగానే దేవికోటను తమకు ఉండనిస్తే ఇకముందు సాహురాజుకు సహాయం చేయకుండా వుంటామని ప్రతాపనసింహునితోనే బేరంపెట్టారు! ఈ వాలకంయెక్క మొదటి అంశం ఇలాగ పూర్తి అయింది. తరువాతకొంతకాలం జరిగింది.

ప్రతాపసింహుడికింత అన్యాయము జరిగినప్పటికీ కర్నాటకనవాబు తగాదాల సందర్భంలో ఇంగ్లీషువారికీ, ఫ్రెంచివారికీ జరిగిన యుద్ధాలలో ప్రతాపసింహుడు పాపము ఇంగ్లీషువారి పక్షాన్నే అవలంబించి నమ్మకంగా నున్నాడు. ఆయుద్ధాలలో ఇంగ్లీషువారు జయించినందువల్ల వారి నాశ్రయించిన మహమ్మదాలీ కర్నాటకకనవాబుగా స్థిరపడి వారి చేతులలో కీలుబొమ్మ అయిపోయినాడు. ఒక మూలనుంచి తన రాజ్యాధికారాలూ, రాజ్యమూ కూడా తన చేతులలోనుంచి జారి ఇంగ్లీషువారి చేతులలోకి పోతూ వుండగా ఈ నవాబు తనకు పచ్చపచ్చగా కనబడుతూ వున్న తంజావూరు రాజ్యముమీద కన్నువేసి దానిని ఎలాగైనా కబళించాలని విశ్వప్రయత్నాలు చెయ్యడం ప్రారంభించాడు. అతడు ఏదో సాకు కల్పించి తనసైన్యాలను తంజావూరు మీదికి దండుపంపాడు. అంతట తంజావూరురాజు ఈయన్యాయాన్ని గుఱించి తనస్నేహితులైన ఇంగ్లీషు వర్తకకంపెనీవారితో