పుట:Kasiyatracharitr020670mbp.pdf/390

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3 కోసులదూరములోవుండే చినగంజాం అనేవూరు 6 గంటలకు చేరినాము. దారి యిసకపొర అయినా కాలు దిగబడేపాటి బొల్లియిసక కాదు. చినగంజాంవూరిచుట్టూ వుప్పుపంట విస్తారము చేస్తారు. వూరు నిండా చిన్నది కాదు. యిక్కడ కొళంద వీరాపెరుమాపిళ్ళ సత్రము వొకటి వూరికి బయిలున వున్నది గనుక అక్కడదిగినాను. ముసాఫరులకు కావలశిన సామాను దొరికినది.

22 తేది వుదయాత్పూర్వము 3 గంతలకు బయిలుదేరి యిక్కడికి 4 కోసుల దూరములోవుండే అమ్మనబోలు అనేవూరు6 గంటలకు చేరినాను. దారి నిన్నటిదినము మేమునడిచినట్టె ఉపాయమయిన యిసకగా వున్నది. చనగంజాం అనే వూరితో గుంటూరు జిల్లా సరిహద్ధుసరి. యివతల నెల్లూరిజిల్లా అమ్మనబోలు అనేవూరు గొప్పదేను. సమస్త పదార్థాలు దొరుకును. కృష్ణకు యీవలవుండే యిండ్లు అన్ని పూరివేసికట్టివున్నవి. పెంకుటిండ్లు సకృత్తైనందున యీ దేశస్థులకు అగ్నిభయము చాలా కలిగివున్నది. బాపట్ల వద్దినుంచి నాతోకూడా వచ్చిన పరిచారకపు బ్రాహ్మణులు కొందరు వారి స్వగ్రామమయిన లంజచెరుకూరికి రెండుకొసులదూరములో వుండగా వెళ్ళి అమ్మనబోలులో మళ్ళీ వచ్చి కలుసుకున్నారు. ఈ వూరి గ్రామ కరణము యింట్లో వంట భోజనాలు కాచేసుకున్నాము. బాపట్ల వలెనే యీ వూళ్ళోనున్ను తొపులు చెరువులు వసతిగా వున్నవి. మధ్యాహ్నము మీదట రెండు గంటలకు బయిలువెళ్ళి యిక్కడికి ఆమడదూరములో వుండే ఆకులల్లూరు అనేవూరు 6 గంటలకు చేరినాను. దారి వుప్పుకలిశిన రేగడ. వర్షాకాలములో నడవడము ప్రయాసగా వుందును.'

ఆకులల్లూరు అనే వూరు యధోసితము పెద్దదిగా వున్నది. 80 బ్రాహ్మణ యిండ్లు వున్నా స్థలము యిచ్చేవారు కారని ప్రసిద్దికెక్కివున్నారు. అయినప్పటికి యీ శీమగ్రామ అధికారులయిన రెడ్డి కరణాలను పిలిపించి మాట్లాడి వొక బ్రాహ్మడి యిల్లు కురుర్చుకుని అందులో బసచేసినాను. అన్నిపదార్ధాలు దొరికినవి.

రాజమహేంద్రవరము మొదలు గుంటూరుజిల్లా సరిహద్దువరకు