పుట:Kasiyatracharitr020670mbp.pdf/326

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పదిమంది వాసము చేయుచు బంగాళీ ప్రభువులను ఆశ్రయించి వారివల్ల జీవనము చేయుచున్నారు.

బంగాళీ వారికి శివప్రతిశ్హ్ట చేయడము బహు అగత్యము గనుక గర్భగృహము మాత్రము కట్టి గుమ్మటపు అందముగా స్థూపీ కట్టి యీ ప్రాంతములలో అనేక లింగాలు ప్రతిష్ట చేయబడివున్నవి. యీ షహరులో అనేక తటాకములు కలవు. అందులో నేను దిగిన ప్రదేశములో వుండే మూతిబీలనే గుంట బహుప్రసిద్ధమయిన వుదకముకలది. యీ షహరులో వుద్యానవనములున్ను అనేకముగా వున్నవి. అందులో గంగకు అవతలి పక్కవుండే కుఫిణీవారి "బోతానికాలు గార్డన్ " అనే వనౌషధుల తోట బహుగొప్పది. నిడుపులో వుత్తర దక్షిణాలు అయిదు గడియల దూరము వుండును; వెదల్పులో సుమారు మూడు గడియల దూరము కద్దు.

కుంఫిణీవారు, బంగాలీల శిక్ష నిమిత్తము, కొన్ని కాలీజు పల్లె కూటములు పెట్టినారు. అందులో చదివి తీరిన పిల్లకాయలు దేశము విస్తారం కర్మభూయిష్టమయి నప్పటికిన్ని శుష్కవేదాంతులై ప్రవర్తింపు చున్నారు.

యీ దేశస్థులు మీసాలు ప్రాయశా: వుంచడములేదు క్షౌరము దినముమార్చి దినము చేసుకుంటారు. స్త్రీలు పురుషులున్ను బహుశా లలాట శూన్యులుగానే తిరుగుతూ వుంటారు. తులసీమణిధారణ విస్తారము కద్దు. కొందరు స్త్రీలు ముక్కుమీద పచ్చ పొడుచుకుంటారు. పట్నాప్రాంతముల స్త్రీలకు పాపటలో సిందూరమును కాయముగా ధరించడము శృంగారమని తోచినట్టు వీరికి ఆ పచ్చ శృంగారముగా తోచి వున్నది. యిక్కడదొరికే చీరలు 12 మూరకుయెక్కువ దొరకవు. తెల్లచీరలే సాధారణముగా ధరించుతారు.

షహరు వీధులలో భిక్షుకులు నిండా తిరగడములేదు. యిండ్లబాడిగె నవుకర్ల జీతాలున్ను బహు భారీగా వున్నవి. జాతిదొరలున్ను గొప్ప హిందువులున్ను సరకారనే పేరుపెట్టి వొక ప్రధాన నవుకరును వుంచుతారు. ద్వారమువద్ద కాచివుండడమునకు దారువాన్ అనే పేరుతో వొక నవుకరును అవశ్యముగా వుంచుతారు.