పుట:Kasiyatracharitr020670mbp.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యీ ప్రయగలో పైన వ్రాసిన దాపువల్ల అటువంటి ఖర్చు ఒక గవ్వ అయినా తగిలినది కాదు. ప్రయాగలో స్నానఘట్టపు బంట్రౌతులు నిత్యము నా సేవచేస్తూ వచ్చినందున వారికిన్ని నా తయినాతి బరక్రదాసు బంట్రౌతులకున్ను మాత్రము నేను వచ్చేటప్పుడు కొంచెము యినా మిచ్చినాను.

ప్రయాగ యిండ్లు, అంగళ్ళు యధోచితమైన వెడల్పు గలవిగానే కట్టివున్నవి. ప్రయాగలో చెప్పే సంకల్పక్రమము మన దేశమువలెనే 'భరతఖండే' అనే మట్టుకు చెప్పి అటుతర్వాత 'ఆర్యావత్రాంతగ్రత బ్రహ్మకైవర్తె కదేశే, విష్ణు ప్రజాపతి క్షేత్రే, షట్కోణమధ్యే, అంత ర్వేద్యాం, భాగీరధ్యా: పశ్చిమే బాగే, కాలింద్యా: ఉత్తరే తీరే, నటస్య పూర్వదిగ్భాగే, విక్రమశకే, బౌద్ధావతారీ, ప్లవనామ సంవత్సరే' అని పిమ్మట మనదేశరీతిగా మాసము తిధి మొదలయినవి చెప్పవలసినది. కాశిలో చెప్పే సంకల్పక్రమమేమంటే 'ఆర్యావత్రైకదేశే, అవిముక్త వారణాసీక్షేత్రే, అసివరణయోమ్ర ధ్యే:, మహాశ్మశానే, అనందమనే, గౌరీముఖే, త్రికంటకవిరాజతే, భాగీరధ్యా: పశ్చిమేతీరే, బౌద్ధావతారే, విక్రమశకే, ప్లవనామసంవత్సరే' అని చెప్పవలెను. ఇటువంటి కాశీమహాక్షేత్రమును అకుటోబరు 27 తేది ఉదయమయిన 8 ఘంటలకు శ్రీరామకటాక్షముచేత చేరినాను.

పండ్రెండవ ప్రకరణము

కాశీపట్టణములో నిండా జనసంఘము కలిగివుండును గనుక వూరికి బయట అసివద్దవుండే తోటలలో ఒక తావున దిగవలెనని యోచిస్తిని. వాట్లలో స్థలము సంకుచితముగా వుండినందున నున్ను మణికర్ణిక మొదలయిన స్థలాలకు దూరమవుట చేతనున్ను కాశీతంబురాయనియొక్క కేదారఘట్టములో వుండే రెండు అంతస్థులు నాలుగు ముంగిళ్ళు కల ఒక పెద్దయింట్లో దిగినాను. నాకోసరమై ఆస్థలము ముందుగా ఖాళీచేసి శుద్ధి చేసివుంచియున్నందున బహుసౌఖ్యముగానే వుండెను. ఆయిల్లు గంగ యొడ్దుగానే వున్నందున సమ్మతి అయినప్పుడు మిద్దెమీదినుంచి గంగా దర్శనము చేయాడానికి అనుకూలముగా వుండినది.