పుట:Kasiyatracharitr020670mbp.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చెన్నాడుగడ వద్ద ఒక కొండవున్నది. ఆ కొండమీదనే గంగ ఒడ్దుగా ఒక కోట యున్నది. దాన్ని యింగిలీషువారు ఇప్పటికి బహు బస్తీగా ఉంచుమొన్నారు. కాశికి యెదట గంగకు ఇవతలి పక్కనుండే వ్యాసకాశీలో 26 తేది రాత్రి 8 ఘంటలకు ప్రవేశించినాను. ఇక్కడికి కాశీపట్టణము తెలియుచున్నది. నిత్యము చంద్రాస్తమయమయ్యేవరకు నా పడవలు తోయిస్తూ వున్నాను గనుక అదేరీతిగా యింకా రెండు గడియలు తోయిస్తే కాశి చేరుదును. అయితే ఉప వాసముతో మహానగరము చేరవలసిన నియమము గనుక యిక్కడనే ఈ రాత్రి వసించడమైనది.

గంగలో బజరాలమీద వెళ్ళే సౌఖ్యము అనుభవ వేద్యము గాని వ్రాయ శక్యము కాదు. దిగిన తావున పారా యియ్యడానికి మాత్రము మనవంటి వారికి మనుష్యులు చాలివుండవలసినది. సామాన్యపు ముసాఫరులు పడవలమీద వస్తే పెరిమిట్టు మనుష్యులనే సుంకం బంట్రౌతులు సోదా యియ్యవలె ననే బహనా (వంక; నెపము) ప్రతి వూరిదగ్గర పెట్టి యేమైనా లంచము యియ్యకపొతే మూట ముల్లెలు నిచ్చి అభాసు చేసి పడవలను నిలిపి బహు తొందర పెట్టుతారట. పేదలకు ప్రయాగనుంచి కాశికి రావడానికి పడవకు యిచ్చే బాడిగె గాక మనిషికి 1 కి రూపాయి వంతున లంచాలకింద తగులుతున్నదట. యీ లంచాలు మూలకముగానే యీ ఘాట్లు సుంకపు దారొగాలకు జీతము పదిఅయిదు రూపాయలు అయినా యిన్నూరు మున్నూరు రూపాయలు నెల 1 కి సంపాదించేటట్తు మిరిజాపూరులో నాకు తెలిసినది. ప్రయాగలో జూసీసరాయి సుంకము వారికి నా మిత్తమై జరిగిన దాపువల్లను, ఆ జిల్లా బంట్రౌతులు కూడావున్నందుచేతనున్ను అటువంటి శ్రమ నాకు యెక్కడా కలిగినది కాదు.

హయిదరాబాదు మొదలు యింగిలీషుదొరల వద్దికి మనవంటి వారు పోయి రాగానే కొంచెములొ తృప్తిలేని ఆదొరలవద్ది నకీబులు చోపుదార్లు వగయిరాలు యినాములకు వచ్చుచున్నారు. యీ దుబారు ఖర్చు విస్తారముగా అక్కడక్కడ తగులుతూ వచ్చినది.