పుట:Kasiyatracharitr020670mbp.pdf/119

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


తమలపాకులు మొదలయినవి కూడా సంతకు తెచ్చుచున్నారు. ఈ రాత్రి ఇక్కడ నిలిచినాను.

23 తేది ఉదయాన 6 1/2 ఘంటలకు బయలువెళ్ళి 8 కోసుల దూరములో నుండే గూంగాం అనే యూరు 11 ఘంటలకు చేరడమయినది. దారి ముందు నడిచిన దినముల దారివలె నల్లరేగడ, రాతి గొట్టు కూడా కలిగియున్నది. యిక్కడికి 4 కోసుల దూరములో నుండే కాకిఘాటు అనే యూరివరకు కొంచెము పొడిచెట్ల యడివి భాట కిరుప్రక్కల నున్నది. కాకిలిఘాటు ఊరివద్ద నదివంటి వాగు ఒకటి దాటవలసినది. యేదులాబాదు మొదలుగా ప్రతియూరు న్నొక యేరు వంటి వాగును అనుసరించి యున్నది. చెరువులు నిండాలేవు. ఈవాగులే ఉదక సమృద్ధిని కలకలగచేయు చున్నవి. కాకిలిఘాటు మొదులుగా రాతి గొట్టున్ను అడివిన్ని లేదు. భాట కిరుపక్కల చదరమైన భూమి. గూంగాం అనే యూరు కసుబాస్థలము. బక్కిబాయి అనే నాగపూరు రాజు బంధురాలికి జాగీరు గ్రామము. ఈవూరివారున్నూ, ఇక్కడి యధికారస్థులున్ను, నాగపూరు షహరుకు సమీపమందున్నారు గనుక అలక్ష్యము, అహంకారమునున్ను వహించియున్నారు. అయినా బస్తీ గ్రామము గనుక అన్ని పదార్ధాలు బజారులో దొరుకును. ఈవూరిమధ్య స్వచ్చమయిన జలము కల వాగు ఒకటి పారుచున్నది. దేవాలయము, ధర్మశాల అనే చావడి, బ్ర్రాంహ్మణ యిండ్లున్నవి. ధర్మశాల అనేది ఒక తాళ్వారము వీధికి అభిముఖముగా వేసి యుంచున్నది.

యీ దేశపు ముసాఫరులు తాము బ్రాంహ్మణులయినా దృష్టిదోషము పాటించడము లేదు. గనుక అందులో దిగి, వీధిలోవచ్చేవారు పొయ్యేవారున్నూ చూడగా వంట చేసుకొని భోజనము చేయుచున్నారు. భ్రాంహ్మణులు భోజనము చేసేటప్పుడు శూద్రులను యెదుగా కూర్చుండ బెట్టుకొని మాట్లాడు చున్నారు. శూద్రులను ఎదట పంక్తిగా తమతోపాటు కూర్చుండపెట్టి వడ్డించి చూచుచు, మాట్లాడుచు బోజనము చేసుట కలదు. అయితే "మన ఏపయనుష్వాణాం కారణం బంధమోక్షయో!" అనే న్యాయముచొప్పున