వారు నన్ను ఏదో విధంగా గేలిచేయ మొదలిడినారు. నేను "కార్యార్థినః కుతోగర్వ” గనుక, ముందవధానం చేయవలసి వుంది, వీరితో మనకు పోట్లాట తగదు, ఇందులో వకరు సభ చేయించేవారి కత్యావశ్యకులు, ఇప్పుడేమైనా వైరస్యం కలిగితే వీరి ద్వారా కాబోయే కార్యం చెడవచ్చునని వూహించి, వారికి వోడిపోయినట్లు నటిస్తూ కాలక్షేపం చేసేవాడను.
చందా ముష్టి
అంతలో సభ జరిగింది. నిడమఱ్ఱులో మోస్తరుగా ఏవిధమైన కమ్మీలు కృత్రిమాలూ లేకుండా దివ్యంగా అష్టావధానం పూర్తి చేశాను. సభ్యులు సంతోషించారు. గ్రామము చాలా పెద్దది. నూటపదహారు వఱకు చందా కాగితంమీద పడ్డది. వసూలు చేసి వారంలోగా సమ్మానించి పంపాలని కరణంగారి నిజమైన వూహ, ఈ స్థితిలో పినతండ్రి అమ్మిరాజుగారు, ‘నీవు వసూలు చేసేదేమిటి? ఆ కాగితం ఆయనకిస్తే ఆయనే వసూలు చేసికొంటాడని మెల్లగా ఆయన బుద్ధి తిప్పేశాడు. దానిమీద ఆయన నాకు చందాకాగితం చేతికిచ్చి వసూలు చేసికొమ్మన్నాడు. నాకు పట్టరాని కోపం వచ్చింది. అవసరాన్ని బట్టి దిగమ్రింగినాను. వసూలుకు తిరగడానికి మొదలు పెట్టాను. స్నాన సంధ్యాద్యనుష్టానాలు ముగించుకొని బయలుదేరి వెళ్లాటప్పటికి వక గృహస్టును చూడడం అయ్యేది. అంతలో భోజనానికి కనిపెట్టుకుంటారని బసకు రావలసి వచ్చేది. ఆ వెళ్లే యిళ్లు అక్కడా అక్కడా కొబ్బరితోటల్లో వున్నాయి. చాలవఱకు రాజుల పద్దులే. ఆ రాజు