పుట:Kasi Yatra Chellapilla Venkatasastry.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొన్న బాలబోధలో వాక్యానికి సార్ధక్యం వూహించుకొన్నాను. కాలువకు అక్కడక్కడ లాకులు వుంటాయి గదా? ఆ లాకుల దగ్గఱ ఎంతత్వరగా వెళ్లే స్టీమరుకైనా కొంత ఆలస్యం తప్పదు. లాకు ఇక వక అరమైలులోపుగా వుందన్నప్పుడు, నేను గభాలున కాలువలో దూకి ఈదుకొని వడ్డుకు వెళ్లి తరువాయి దీర్చికొని లాకు దగ్గర పడవను కలిసికొనే వాడను. ఇలా రెండుమూడుసార్లు చేయవలసివచ్చింది. ఈ చేయడంలో వక పర్యాయము నెత్తికి చుట్టుకొన్న బట్ట తీసివేయడం మరచినాను, దానితో మునిగి పయికి తేలడం కొంత కష్టమయింది. వ్రాయమఱచాను. చదువుకొంటూ వున్నది శాస్త్రం, పుట్టింది బ్రాహ్మణకులం, చేసిన శుశ్రూష మహా పండితులది, కాశీగంగతో సహా స్వదేశానికి వస్తూవున్నాను. ఇట్టిస్థితిలో జరిగినంతలో అనాచారంగా యెట్లు వర్తించడం? కనుక కాలువలో దూకేటప్పుడు చెంబోక్కటి ముందుగా గట్టుకు విసిరేసి తరువాత దాన్ని పుచ్చుకొనేవాణ్ణి. ఈలా చేయడంవల్ల "అపాత్రత్వం" వుండదని నావూహ. కాని ఒకసారి ఆ చెంబు దొర్లి నేను వడ్డుకు చేరడానికి పూర్వమే కాలువలో పడి మునిగి పోయింది. నాకు సంభవింపవలసిన గండం చెంబుని కొట్టుకు పోయిందని నా మిత్రుడు కోమటి సంతోషించాడు.

త్రివిక్రమావతార సాదృశ్యం

ఏలాగో యీలాటి గండాలతో కటకం చేరినాము. అక్కడ మన తెలుగు దేశస్టులు, నిరతాన్న దాతలు, ఇంటి పేరు మరచాను - వేంకటాచలం పంతులు గారింట్లో ప్రవేశించాము, బహు