Jump to content

పుట:Kasi Yatra Chellapilla Venkatasastry.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇంద్రగంటి గోపాలశాస్రులుగారు లోనైనవారి పేరులే అందఱూ యెఱుగుదురు. ఇందులో కొందఱు నలుబది యేండ్లు, ముప్పదియేండు కూడా కాశీలో నివసించినవారు. ఒక శాస్త్రవేు కాక, చతుశ్శాస్త్రములున్నూ వచ్చినవారు. ఒక శాస్త్రమే చిరకాలం ఒకసారి చదివి, తెలియక, మళ్లా తిరుగదోడి అంతా చదివి గొప్పవారైనవారు కొందఱు. కొందఱు చిరకాలం చదివి పండితులై దేశానికి వస్తూ ఏ సంస్థానంలోనో వాదంలో వోడిపోయి మళ్లా కాశీకి వెళ్లినవారు. వీరిని గూర్చి ప్రత్యేకించి వ్రాయవలసినదేకాని, యిక్కడ వ్రాయడముకు స్థలం చాలదు, ఇందులో శ్రీ హరి శాస్రులవారిని శ్రీ విజయనగరం మహారాజులుంగారు స్వయంగా ప్రార్ధించి కాశీనుండి తీసుకువచ్చి తమ సంస్థాన పండితులుగా నేర్పఱచుకొన్నట్లు వింటాను. శ్రీ కొవ్వూరి గోపాలశాస్త్రిగారనే వారు షడ్డర్శనీపారగులగుటేకాక, మంత్రశాస్త్రంలో కూడా ప్రత్యక్షం చేయడానికి తగ్గంత నిష్టాపరులు, కాశీలో దుర్గను గూర్చి వీరు ప్రత్యేకించి పండ్రెండేళ్లు తపస్సు చేసి ప్రత్యక్షం చేసికొన్నట్లు చెప్పుకుంటారు. వీరిని కూడా శ్రీ విజయనగరం మహారాజులుంగారు ప్రార్ధనపూర్వకంగా తమ సంస్థానమునకు రప్పించి నిల్పుకొనడమే కాకుండా, శ్రీ హరిశాస్రులుగారి కెట్టి గౌరవము లేర్పరచినారో అట్టి గౌరవములనే ఈ శాస్రులుగారికి కూడా ఏర్పరచినట్లు వినికిడి. ఈ గౌరవప్రపత్తులకు అంతకు పూర్వం సంస్థానములో వుండే పండితులు సహింపక వక యుక్తిచేసి, గోపాలశాస్త్రిగారు మంత్రశాస్త్రంలో మహాగొప్పవారని చెప్పగా చెప్పగా, మహారాజావారు వారి శక్తి మనకేలా తెలుస్తుందని