పుట:Kasi Yatra Chellapilla Venkatasastry.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అన్నారనిన్నీ దానిమీద పండితులు, "మహాప్రభో దేవరవారు కోరితే శాస్రులవారు ప్రత్యక్షంగా వారి శక్తిని చూపిస్తారని జవాబు చెప్పినారనిన్నీ పిమ్మట నెప్పుడో మహారాజావారు, గురోజీ, మంత్రశాస్త్రంలో మీ ప్రజ్ఞ మాకొకమారు చూపించాలని కోరినారనిన్నీ చిత్తం అని చెప్పి శాస్రులవారు, నేను ఈ రోజు జపం చేసికొని వస్తాను, అప్పటికి బాగా నిమ్మకాయంత బంగారపు ముద్దను సిద్ధంచేసి వుంచవలసినదిగా చెప్పినారనిన్నీ శ్రీమహారాజావారు అట్లే సిద్ధంచేయగా శాస్రులవారు ఆ బంగారం మీద మంత్రోదకం ప్రోక్షించేటప్పటికి ఆ ముద్ద రెండు ముక్కలుగా పగిలిందనిన్నీ ఆ పిమ్మట మహారాజావారికి లోపల భయంకలిగి ఎప్పుడైన ఈయనకు మనమీద కోపం కలిగితే ఇదే మోస్తరుగా మంత్రోదకం ప్రోక్షించడం తటస్థింపవచ్చును, అప్పుడు మనపని కూడా దీనితోపాటే కావచ్చును, అని వుపాయంగా వారిని సంస్థానంలో నుండి తప్పించి గోదావరీతీరంలో కొవ్వూరులో వుండేటట్లు ఏర్పరచి, వారికి నెల నెలకూ ఇచ్చే భృతకం కొవ్వూరుకే పంపేవారనిన్నీ గురువుగారి వల్ల విన్నాను. విజయనగర సంస్థానంలో ఇప్పటికి వెనుకటి ప్రభువులందఱున్నూ తమ సంస్థానంలో వున్న యెవరిని గాని తొలగింపవలసి వచ్చినప్పుడు, తొలగించిన వారికిచ్చే జీతం పంపించడమే ఆచారము. ఇక మళ్లా దర్శనం మాత్రం తొలగించినవారికివ్వక పోవడమే కాదు, వారి వంశస్టులుకూడా, వీరికేకాదు, వీరి వంశస్టులక్కూడా యివ్వరు. శ్రీ హరి శాస్రులవారి విషయంలో ఈ సందర్భం అంతా యెఱిగినదే కావున విస్తరింప బనిలేదు.