పుట:Kasi Yatra Chellapilla Venkatasastry.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దండ్రులకు తాత్కాలికముగా కలిగిన మనఃకలహంవల్ల కోటలోని చరాస్తిని మాత్రము గైకొన్న తల్లిగారివల్ల కోట వదలి బాల్యమున నీవలికి రావలసినవారైరి. ఆపిమ్మట అక్కడినుండి తెచ్చిన ధనమువలన ఈ కిర్లంపూడి యెస్టేటు తల్లిగారే పెద్దాపురం సంస్థానమువారివద్ద కొన్నారు. ఈ బుచ్చితమ్మయ్యగారి తల్లిదండ్రులకు తాత్కాలికంగా కలిగిన మనఃకలహంవల్లనే కాట్రావులపల్లె, జగ్గంపేట యెస్టేటులు గూడా యేర్పాటయినాయి. ఇంతకన్న ఈ విషయమునకు ఇక్కడ చోటు చాలదు. కావున ప్రస్తుత ముపక్రమిస్తాను. ఈ బుచ్చి సీతయ్యమ్మగారు మహాధర్మాత్మురాలు. ధర్మవరములో పాఠశాల, అన్నవరంలో ధర్మసత్రము లోనైన ధర్మకార్యాలు పెక్కులు ఈమె చేసినారు. అట్టి ధర్మాత్మురాలిని సేవించే దాసికి మాత్రం మంచిబుద్ధి యేల కలుగదు? కలగడం న్యాయమే. భాగవతములో శ్రీ పోతరాజుగా రేమన్నారు? “అధముడైన వాని కాలగుకంటె నత్యధికునింట దాసి యగుట మేలు" అని కదా! అదియటులుందే. గురువుగారు అమ్మగారితో మనవి చేయమంటే మనవి చేయుటకు వెడుతూ, ఈ వివాహము అమ్మగారి సెలవుమీద తానే జరిగించవలెనని ఆ పరిచారిక వూహించుకొని, సంతోషముతో అమ్మగారితో శాస్రులవారు చెప్పిన మాటలు మనవిచేసి, తన కోరికను గూడా వినయంగా మనవి చేసికొన్నది. అమ్మగారున్నూ తన దాసి బుద్ధికి మిక్కిలి సంతసించి అట్లే కానిమ్మన్నారు. దాసి సంతోషించి శాస్రుల వారితో మనవి చేసుకొన్నది. అంగీకరించారు. సలక్షణంగా అయిదు రోజులున్నూ కామాక్షి ద్రవ్యంతో వివాహం జరిగింది.