పుట:Kashi-Majili-Kathalu.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాజనీతి

35

క్కటియె యవినయమునకుఁ దావలమగుచుండ నన్నియు నొక్కచో నుండు నప్పుడేమి చెప్పఁదగినది?

యౌవనారంభమందు శాస్త్రజలములచేఁ గడఁగబడినను బుద్ధికాలుష్యము నొందకమానదు. తరచుమౌనులదృష్టి రాగముతోఁ గూడుకొని యుండును. నీవంటివారే యుపదేశమున కర్హులు. స్ఫటికమణియందుఁ జంద్రకిరణములువలె నిర్మలమగు మనంబున నుపదేశ గుణములు ప్రవేశించును. గురువాక్యము నిర్మలమైనను జలమువలె దుర్జనులకు శ్రవణగతమై శూలను గలుగఁజేయును. అనాస్వాదిత విషయ సుఖుండవగు నీకిదియే యుపదేశసమయము. కుసుమశర ప్రహార జఝు౯రిత హృదయులగు వారికుపదేశము జలమువలెనే నిలువక జారిపోవును. చందనవృక్షమునఁ బుట్టినయగ్ని మాత్రము దహింప కుండునా? బడబాగ్ని యుదకముచేత నడంగునా? జనులకు గురూప దేశము ప్రక్షాళనజలమువంటిది. విశేషముగా రాజుల కుపదేశించు వారులేరు. జనులు ప్రతిధ్వనివలెనే రాజవాక్యముల ననుసరించి పలుకుదురు.

ధనమదులు దర్పవ్రణపూరితములగు చెవులుగలవారై గురూప దేశములను వినరు. వినినను గజములవలె గన్నులుమూయుచు నుపదేష్టలను బాధింపుచుందురు. ధనము ఆళూకాభిమానములఁ గల్పించును. రాజ్యలక్ష్మి తంద్రీప్రదమైనది. రాజ్యలక్ష్మి సరస్వతీయుతుండగువాని నసూయంబోలె జూడనీయదు. గుణవంతు నపవిత్రునిపగిది ముట్టనీయదు. సుజను నున్మత్తునివలెఁ బరిహసించును. వినీతు మహాపాతకుపగిది దాపుఁజేరనీయదు. అది తృష్ణావిషవల్లులకు సంవర్ధనధార, ఇంద్రియమృగములకు వ్యాధగీతి, మోహదీర్ఘనిద్రకు విభ్రమశయ్య, ధనమదపిశాచములకుఁ దిమిరసంహతి, అవినయమున కుత్పత్తిస్థానము. అన్నన్నా! రాజ్యలక్ష్మిచేత నాలింగితులగు రాజులొడలెఱుంగుదురా?