పుట:Kashi-Majili-Kathalu.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

36

కాదంబరి

అభిషేకసమయమందే మంగళకలశ జలములచే దాక్షిణ్యము కడగఁబడు చున్నది.

అగ్నికార్యధూమముచేత హృదయము మాలిన్యము బొందుచున్నది. పురోహితుని కుశాగ్ర సమ్మార్జనముచేత క్షాంతి పోవుచున్నది. చామరపననముచేతనే సత్యవాదిత యెగిరిపోవుచున్నది.

అతిచంచలమగు రాజ్యసంపదలను జూచుకొని గర్వించుచు రాగమగ్నులై అరుదైనను ననేక సహస్రములుభాతిదోచు నింద్రియ సుఖములచేత వివశత్వము నొందుదురు. ఆహా! ధనమదులు ఆసన్న మృత్యులువలె దగ్గిరనున్న బంధువులను సైతము గురుతెరుంగరు. ముఖరోగులు వలె గష్టముగా మాట్లాడుదురు. అంధులువలె దాపున నున్నవారి సైతము జూడలేరు.

జూదము వినోదమనియు, వేట పాటవమనియు, పానము విలాసమనియు, స్వదారపరిత్యాగము అవ్యసనత్వమనియు, నృత్యగీతవేశ్యాప్రసక్తి రసికతయనియు దోషములను సైతము గుణములుగా వర్ణించుచు స్వార్ధనిష్పాదనపరులు ధనపిశితగ్రాసగృధ్రులు నగు వంచకుల మాటలకు సంతసించు రాజుల శిరి యల్పకాలములో నశించును.

అమానుషషోచితములగు స్తోత్రవాక్యములు విని యాత్మారోపణము చేసికొనువారు సర్వజనులకుఁ బరిహాసాస్పదు లగుదురు. కుమారా! నీవెన్నఁడును ఇట్టి దుర్వృత్తులజిత్తమునుఁ జొరనీయకుము. వంచకుల నంతికమునకుఁ జేరనీయకుము. సర్వదా సజ్జనగోష్ఠిని మెలంగుము. సాధులఁదిరస్కరింపకుము. కర్ణేజవులమాటల వినకుము. పరిచారకులకుఁ జనువీయకుము. రాగలోభాదుల హృదయంబున నంటనీయకుము. అభిజాతునైనను, పండితునైనను, ధీరునైనను రాజ్యలక్ష్మి దుర్వినీతుల జేయుంగావున నీకింత సెప్పితిని. నీకు నా బోధ యేమియునవసరములేదు. రాజ్యభారమువహింపుము. ప్రజలదయతోఁ