పుట:Kashi-Majili-Kathalu.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కపింజలునికథ

155

కొంతసేపటికి గమనామాసమించుక తగ్గినది. మెల్లగాఁ జెట్టుదిగి శీతలంబగు తచ్ఛాయ నాశ్రయించితిని. మఱియుఁ గింజల్కర జోవాసితంబగు నా సరసిజలంబు దృప్తిగాఁ ద్రావి త్రావి మృదువులగు కమలకరుణికాబీజములచేతను, తీరుతరుపర్ణాంకురములచేతను, పండిరాలిన ఫలములచేతను ఆకలి యడంచుకొని యపరాహ్ణకాలంబునఁ దిరుగా బయలుదేరిన నెంతదూరముబోవఁగలనో యని యాలోచించుచు మార్గగమనఖిన్నములగు నవయవములకు విశ్రాంతి గలుగుటకై నీడతోఁ గూడిన తత్తరుశాఖ నాశ్రయించి మొదటి భాగమున నేకూర్చుంటిని. అంతలో నాకు నిద్రపట్టినది. కొంతసేపటికి మేల్కొనిలేచి చూచు వఱకు త్రెంపరాని తంతుపాశములచేఁ గట్టఁబడి యుంటిని.

అప్పుడు పాశములేని కాలపురుషుని భాతి నుక్కుముక్కలచే నిర్మింపఁబడిన రెండవ ప్రేతపతిచందమునఁ బుణ్యరాశికిఁ బ్రతిపక్షు వైఖరిని బావమున కాశ్రయుండట్ల తోచుచుఁ గోపకారణము లేకయే భ్రుకుటీరౌద్రములైన నేత్రములు గలిగి కృతాంతునికిఁగూడ భయము గలుగఁజేయు వాఁడుంబలె నొప్పుచు మలినవసనాంగుడైఁ యదృష్టాశ్రుతపూర్వుండైనను స్వరూపప్రకటిత క్రౌర్య దోషుండగు నొకానొక పురుషు నెదురం గాంచితిని.

వానిం జూచినతోడనే నాకు జీవితమందు నిరాశ గలిగినది. అయినను నించుక ధైర్యము దెచ్చికొని వాని కిట్లంటి. భద్రా! నీ వెవ్వఁడవు? నన్నిట్లేమిటికి గట్టితివి? మాంసలాలసత్వమున నంటివేని నిద్రలోనే నన్నుఁ జంపఁ దగినది. నిరపరాధినగు నాతో నీ కేమిపని? విలాసమున కిట్లు పట్టితినంటివేని కౌతుకము తీరినదిగదా? ఇఁక వదలుము. మిత్రులంజూడ నేను దూరము పోవలసియున్నది. ఆలస్యము నా హృదయము సహింపదు. నీవును బ్రాణిధర్మమునందే యుంటివి కదా! నీయెఱుఁగని ధర్మంబులుండునా? అని ప్రార్ధించిన వాఁడిట్లనియె.