పుట:Kashi-Majili-Kathalu.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4

కాదంబరి

ముందు నడుచుచుండఁ బైడిశలాకలచే రచింపఁబడినను జిలుకరెక్కల కాంతులచే మరకతమయమైనది వోలెఁ బచ్చవడియున్న పంజరమును జేతంబూని కాకపక్షంబులు చలింపనొక చండాల బాలకుఁడు తోడరానసురాపహృతంబగు నమృతంబు వేల్పులకిడ నవధరించిన మధుసూదనుని మోహినీరూపమును బురడించుచు మీగాళ్లదనుక మేలిముసుగు వైచికొనుటచే సంచరించు నింద్రనీలపుబొమ్మవలెనొప్పుచు సంతతము వెన్నుని యురమందు వసించుటఁ దదీయశ్యామప్రభాసంక్రమణంబున నల్లబడిన మహాలక్ష్మియుంబోలె బలరాముని హలాపకర్షణ భయంబునఁ బారివచ్చిన యమున చాడ్పునఁ గుపితహరనయన దహ్యమానుండగు మదనుని ధూమమున మలినీకృతయగు రతిననుకరించుచు నచిరోపారూఢ యౌవనయై వచ్చుచున్న యామాతంగ కన్యక నిముషలోచనుండై యారాజమహేంద్రు డీక్షించి విస్మయా వేశితహృదయుఁడై యిట్లు తలంచెను.

అన్నన్నా ! తగనిచోట హాటకగర్భున కక్కజమగు రూపు గల్పించు ప్రయత్న మేమిటికిఁ గలుగవలయును. అక్కటా ! నిరతి శయసౌందర్యవిశేషంబునం బొలుపొందు నియ్యిందువదనను ముట్టరాని నికృష్టకులంబునం బుట్టించెగదా ? మాతంగజాతిస్పర్శభయంబున ప్రష్ట ముట్టకయే యిప్పూబోణిని నిర్మించెనని తలంచెదను. కానిచోఁ దదీయకరతలస్పర్శ క్లేశితములగు నంగముల కింత వింత కాంతియు లావణ్యము గలిగియుండునా ! ఇసిరో ! సరసిజభవుండెప్పుడు నసదృశ సంయోగమునే చేయుచుండును గదా ? అతిమనోహరాకృతిగల యీనాతి క్రూరజాతియం దుదయుంచుటచే నిందిత సురతయై యసుర సంపదవలె నభోగ్యమైయున్నదని నా డెందము మిక్కిలి పరితాపము జెందుచున్నది.

అనియతండు తలంచుచుండ నక్కన్యారత్నము మ్రోలకువచ్చి