పుట:Kashi-Majili-Kathalu.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శూద్రకమహారాజు కథ

3

మిగుల సుందరుఁడగు నానృపనందనుండుఁఁ ప్రధమవయస్సున స్త్రీజనమును దృణముగాఁ జూచుచు సంతానార్ధులగు మంత్రులచే బోధింపఁబడియు సురతసుఖంబు నందలి విరోధంబునంబోలె దార సంగ్రహం బనుమతింపఁ డయ్యెను.

ఒకనాఁడు ప్రొద్దుట నప్పడమి రేడాస్థానమంటప మలంకరించి యున్నసమయంబున నంగనాజనవిరుద్థముగ వామకక్షమునఁ గౌక్షేయకమిడికొని సన్నిహితపన్నగం బగు చందనలతవోలె భీషణరమణీయమగు నాకారముతో బ్రతీహారి యరుదెంచి జానుకరకమలంబులు పుడమిసోక మ్రొక్కుచు నిట్లనియె.

దేవా ! కుపితుండగు దేవేంద్రుని హుంకారంబున నేలంబడిన త్రిశంకుని రాజ్యలక్ష్మియోయన దక్షిణదేశమునుండి మాతంగకన్యక యోర్తు పంజరముతో నొకచిలుకను దీసికొనివచ్చి ద్వారదేశమునఁ నిలువంబడి దేవరతో నిట్లు విజ్ఞాపన చేయుచున్నది. భువనతలంబున గల రత్నములకెల్లఁ గల్లోలినీ వల్లభుండువోలె దేవరయే యేకభాజన మని తలంచి యాశ్చర్యభూతమగు నీవిహంగమరత్నము నేలికపాద మూలమును జేర్చు తలంపుతో నరుదెంచితిని. దర్శనసుఖంబను భవింపఁగోరుచున్న దాన.

అని తత్సందేశ మెఱింగించిన ప్రతిహారి వచనంబులు విని యాభూనేత కుతూహలోపేతుఁడై యాసన్నవర్తులగు మిత్రులమోము లుపలక్షించుచు దీనందప్పేమియున్నది, ప్రవేశపెట్టుడని యాజ్ఞాపించుటయు నాప్రతీహారి సత్వరమ యఱిగి యమ్మాతంగ కుమారిం దీసికొని వచ్చినది.

ముదిమిచేఁ బండిన శిరముగలిగి నేత్రకోణము లెఱ్ఱని జీరలతో నొప్పుచుండ జవ్వనముడిగినను బరిశ్రమ గలుగుటచే శిధిలముకాని మేని బింకముతోఁదెల్లనివస్త్రములు ధరించి వృదమాతంగుఁడొకఁడు