పుట:Kashi-Majili-Kathalu.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శూద్రకమహారాజు కథ

5

యించుకవంగి ప్రోడవలె నమస్కరించి యమ్మణికుట్టిమంబుననోరగా గూరుచున్నంత నావృద్ధ మాతంగుఁడు పంజరములోనుండగనే చిలుకను చేతితోనంటి సవరించుచు గొంచెము దాపునకువచ్చి ఱేనికిం జూపుచు నిట్లనియె. దేవా ! యీ చిలుక సకలశాస్త్రార్థములు గుర్తెఱుంగును. రాజనీతియందును పురాణకధాలాపమునందును దీనికి మంచి నై పుణ్యముగలదు. కావ్యనాటకాలంకార గ్రంథములు జదువుటయే కాక స్వయముగా రచింపఁగలదు. వీణావేణుమురజప్రభృతి వాద్య విశేషముల సారమిదియే చెప్పవలయును. చిత్రకర్మయందు ద్యూత వ్యాపారమునందును గజతురగ స్త్రీలక్షణ జ్ఞానమందును దీనిని మించిన వారు లేరు. ప్రణయకలహకుపితులగు కాముకులం దేర్చు నేర్పు దీనికే కలదు. పెక్కు లేల ? యాపతత్రిప్రవరంబు సకలభూతల రత్న భూతమని చెప్పనొప్పును. దీనిపేరు వై శంపాయనము. సర్వరత్నములకు జలనిధి వోలె దేవర ముఖ్యభాజనమనితలంచి మా భర్తృదారిక యీచిలుకను మీపాదమూలమునకుఁ దీసికొని వచ్చినది. దీనిం దయతోఁ బరిగ్రహింపుఁ డని పలుకుచు నాపంజర మానృపకుంజరుని ముందర నిడి యావృద్ధుం డించుక యెడమగాఁ బోయెను.

అప్పు డప్పతంగ పుంగవము రాజాభిముఖముగా నిలువంబడి కుడిచరణమెత్తి మిక్కిలి స్పష్టములగు వర్ణస్వరములచే సంస్కరింపఁ బడిన వాక్కులతో జయశబ్దపూర్వకముగా నీపద్యముఁ జదివినది.

గీ. అనఘ ! భవదరి నృపవధూస్తన యుగంబు
    చిత్తగత శోకదహనంబు చెంత నిలిచి
    యశ్రుజలపూరమునఁ దీర్థమాడి మరి వి
    గతమహా హారమై ప్రతిస్థితిదనర్చు.

ఆచిలుక పలుకులు విని యానృపతిలకుండు వెఱఁగు జెందుచు ______________________________________________________________________

శ్లో || స్తనయుగమశ్రుస్నాతం సమీపతరవర్తిహృదయశోకాగ్నె !