పుట:Kashi-Majili-Kathalu.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వైశంపాయనుని కథ

139


చున్నదని చిత్తంబునం దలంచు చున్నవాఁడు. కాబోలు కానిమ్ము. నేనతనింజూచి యేమియు మాట్లాడను. పాదంబులఁబడినను గ్రహింపను. మదలేఖా! నీవప్పుడు నాతో నేమియుం జెప్పవద్దుసుమీ! పెద్దతడవు చిక్కులుపెట్టి పిమ్మట మాటాడెదనని యతని గురించిన మాటలే చెప్పుకొనుచు మార్గమున భేదము గురుతెఱుంగక క్రమంబున జంద్రాపీడునిఁ జూడ మిక్కిలి తొందరపడుచు నమ్మహాశ్వేతాశ్రమమునకు వచ్చెను.

అట్లు వచ్చి యందు అమృతరహితమగు సమద్రంబు చందంబున నున్ముక్తజీవితుండై పడియున్న చంద్రాపీడునిం జూచి కాదంబరి హా! ఇది యేమికష్టమని మూర్ఛాక్రాంతస్వాంతయై నేలం బడుచుండ మదలేఖ తటాలునఁ బడకుండ బట్టుకొనినది. పత్రలేఖయుఁ గాదంబరి యొక్క కైదండ విడిచి మోహవేశముతో నొడలెఱుంగక నేలంబడిపోయినది.

కాదంబరియుఁ గొంతసేపటికి దెప్పిరిల్లి మూఢయుంబోలె నేమియు నెఱుంగక యూర్పులు విడుచుట సైతము మరచి రెప్పవాల్పక నిశ్శలతారకలతో నతని మొగమే చూచుచు వ్రాయఁబడిన ప్రతిమవలె కదలక యట్లె నిలిచియుండం జూచి మదలేఖ యామె పాదంబులబడి సఖీ! నీవీ శోకమును విడువుము. స్వభావమృదు సరసమగు నీ హృదయము అతివృష్టి భారంబున విచ్చిన తటాకమువలె భేదిల్లును సుమీ! ఈతండు చైతన్యంబుబాసి పరలోకమున కతిధియైనట్లు తోచుచున్నది. ఇఁక వీనికొరకుఁ జింతింపనేల? యింటికిఁబోయి తల్లి దండ్రుల కామోదము గలుగఁజేయుము. నిన్నుఁజూడక వారు నిమిషము తాళలేరని పలికిన విని కాదంబరి నవ్వి యవ్విద్రుమోష్టి కిట్లనియె.

ఓసి వెఱ్ఱిదాన! నా హృదయమును మృదువుగా జెప్పుచుంటివేమి? వజ్రసారకఠినమైనది. కాకున్న నిట్టి యవస్థఁజూచియు బగుల కుండునా? మఱియు జీవించువారికిగదా తల్లిదండ్రులు బంధువులు పరి