పుట:Kashi-Majili-Kathalu.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

140

కాదంబరి


జనము కావలయు నాకిక వారితోఁ బనియేమి? స్వర్గగమనోన్ముఖుఁడైన వీనికి నమంగళముగా నేను రోదనముగూడ జేయను. పాదధూళియుం బోలెఁ బాదముల ననుసరించియే పోయెదను. ఎవ్వనికొరకు కులమర్యాద విడిచి ధర్మము గణింపక తల్లిదండ్రుల లెక్కసేయక జనాపవాదము నిరసించి సిగ్గువిడిచి వయస్యల గష్టపెట్టి మహాశ్వేతను గురించి చేసిన శపథమును సైతము పరామర్శింపక ప్రయత్నించితినో యట్టి వాఁడు నా నిమిత్తము ప్రాణములు విడువ నాయసువుల నెట్లు పాలించు కొందునో చెప్పుము. నాకిప్పుడు మరణమే శ్రేయముగా నున్నది. నా యెడ నీకుఁ గనికరమున్నయెడ నా చెప్పిన చొప్పున జేయఁబూను కొనుము. వినుము.

గీ. శూన్యమగు నాదు భవనంబు జూచి చూచి
    సఖులు పరిచరులును బంధుజనము లెట్లు
    వగవకట వేడ్కఁ బూర్వంబువలె మెలంగు
    దురొ యటులు సేయుమిదియ నాకరయ హితము.

క. నాదగు భవనాంగణమున
    బోది వెలయనొప్పు చూతపోతకమునకుం
    బైఁ దనరు మాధవీలత
    కాదరమునఁ బెండ్లిసేయు మనుకొనినగతి౯.

సీ. పడకటింటను దల ప్రక్కఁగట్టిన కామ
                పటము వ్రక్కలుజేసి పాఱవేయు
    యువిద! ముద్దుగఁ బెంచుచున్న నాలేడి పి
                ల్లను విడు మొక తపోవనమునందు
    గలికి! నాక్రీడానగము నాశ్రమముగాఁగ
                నర్పింపుమొక్క మహాతపస్వి
    కలివేణి! శుకశారికల స్వేచ్ఛవిహరింప
                విడువుము నా మేని తొడవులెల్ల.