పుట:Kashi-Majili-Kathalu.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

110

కాదంబరి


మంతయు ప్రియుని ముఖచంద్రులుగానే తోచుచుండును. భూమియంతయు దయితాకారములే కనంబడును. వారిచర్యలు కడు విపరీతములుగా నుండునని పలికిన విని యత్తన్వి శిరఃకంపము చేయుచు నాకిట్లనియె.

పత్రలేఖా! నీవిప్పు డెట్లు చెప్పితివో మన్మథుఁడు నన్నట్లు వేపుచున్నవాఁడు. నీవు నాకుఁ బ్రాణమువంటిదానవు కావున నడుగుచుంటిని. ఇప్పుడు నేనేమిచేయఁదగినదో చెప్పుము? ఇంతకుమున్నిట్టి వృత్తాంతము లేమియు నేనెఱుంగను. ఎవ్వరికినిఁ జెప్పరానియిట్టి కష్టములఁ బడుటకంటె మృతినొందుటయే మేలని నాహృదయంబునఁ దోచుచున్నదేమి? చెప్పుమని యడుగగా నేనిట్లంటి.

దేవీ! వలదు వలదు అకారణమరణముతో నీకేమి? ఆరాధింపకయే ప్రసన్నుఁడగు మన్మధుఁడే నీకార్యము జక్కపెట్టును. స్వయంవర విధులచేఁ బతులవరించిన సతుల నెందరం జెప్పను. నీమనంబునం బుట్టినతలంపు అనధ౯మైనదికాదు. శాస్త్రసమ్మతమైనది. దేవీ! మరణోద్యోగమును విడువుము. నీపాదములతోడు వేగ పోయి యాతనిం దీసికొనివచ్చెదను. నన్నుఁ బంపుమని పలికిన విని యక్కలికి ప్రీతిద్రవార్దములగు చూపులచేఁ నన్ను జూడుచు సిగ్గు విడిచి యుత్తరీయము సవరించుచు మెడనుండి ముక్తాహారమును దీసి చేతం బూని ప్రహష౯వివశయై యిట్లనియె.

నాతీ! నీప్రీతి నేనెఱుంగుదును. శిరీషమృదుప్రకృతిగల కన్యకాజనమునకుఁ బ్రగల్భవాక్యము లెట్లువచ్చును. ఇప్పుడు నేనేమని చెప్పవలయునో నాకుఁ దెలియదు. నీవు నాకతిప్రియుండ వైతివంటినేని పునరుక్తిదోషముకదా. నాకు నీయం దనురాగ మెక్కుడనిఁన వేశ్యాలాపమగును. నీవు లేక నేను జీవింపనన ననుభవవిరోథము. నన్ను మన్మధుఁడు ఫీడించుచున్నవాఁడనిన నాత్మదోషోపాలంభము