పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మతంగయోగినికథ.

87

రతినూపుర మంచముపైఁబండికొనియామె రాకజూచి తటాలున మంచముడిగ్గి పాదంబులంబడి నమస్కరింపుచు శోకగద్గదస్వరముతో నశ్రువులచే బాదములు దడుపుచు దల్లీ ! నా కూఁతుండ్రు నన్నువిడిచి లేచివెళ్ళిరి. నాయవస్థ యేమిచెప్పుదునని విచారించుటయు నబ్బురపాటుతో వారునిన్నేల విడిచివెళ్ళిరి? యెక్కడికిఁబోయిరి? ఎఱింగింపు మనుటయు నదిబోడిబాపనవానిం దీసికొనిపోయిరని యావృత్తాంత మంతయుం జెప్పినది. ఆకథవిని యయోగిని మనంబున నించుకవిన్న దనంబుదోప నొక్కింతసేపూరకుండి వారేదెసకుఁబోయిరో యెఱుంగుదువా ? అనియడిగిన నావేశ్య అమ్మా ! నేను గోపోద్రేకంబున నావిషయమేమియు విమర్శించితినికాను. ఏమూలకుఁబోయిరో నాకుఁ దెలియదని యుత్తరము జెప్పినది.

అప్పుడు యోగిని నిట్టూర్పునిగుడించుచు నోసీ ! నేనిప్పుడు నీకూతుండ్రఁ జకవర్తికి భార్యలంచేయు తలంపుతో వచ్చితిని. నారాకనిష్ఫలమైపోయినది. వినుము మహాపురనగరాధీశ్వరుఁడు విపులుఁడను రాజు నవరసరసికుఁడు తేజశ్శాలి రూపంబునమన్మధుఁడే యని చెప్ప దగు. మార్గవశంబున నే నానగరంబునకుంబోయి రాజదర్శనము గావించితిని.

అతఁడు నన్ను భక్తిపూర్వకముగా నర్చించి మీయభీష్టమేమని యడిగెను. దేశపర్యటనమే మాకృత్యము నీసద్గుణంబులు జనులు బొగడవిని యుత్సుకత్వముతో నిన్నుఁ జూడవచ్చితి నాకేకోరికయులేదు. సజ్జనులేనాకు మిత్రులు నీరాజ్యమునాకుఁ బూజ్యముకాదు. నీసాధుత్వమునకు మెప్పువచ్చెనని స్తుతియించిన నతం డుబ్బుచు నన్నుఁగొన్ని దినంబులందుండి సద్గోష్టి జేయుచుండుమని కోరికొనియెను.

నేనంగీకరించి యాఱుమాసములందుంటిని. అప్పుడప్పుడుపోయి యాతనికి మంచిమాటలు సెప్పుచుంటిని. అతనికిఁ జనువయినకొలఁది పరిహాసవచనములు ప్రబలుచుండెను,