పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

86

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

విడిచి సామాన్యపు పుట్టములు ధరించి తల్లితో మఱేమియుంజెప్పక మేడమీఁదికింబోయి గోణికాపుత్రున కత్తెరంగంతయు నెఱింగించిరి.

అతండు వారి సాహసమునకు వెఱగుపడుచుసక్తుండై యంగడికింబోయి వస్త్రమాల్యాను లేపనాదులం గొనివచ్చి వారికిచ్చెను. నూత్నకుసుమమాలాలంకృతలై యక్కాంతలు వింతసోయగంబునం బ్రకాశించిరి. నాఁటిరాత్రియే యాగణికాపుత్రికలు గోణికాపుత్రునితోఁగూడ నొరులకుఁ దెలియకుండ బయలుదేరి ధారానగరాభిముఖముగా నఱిగిరి.

అని యెఱింగించి యయ్యతిపంచాస్యుండు కాలాతీతమగుటయు నవ్వలికధ తదనంతరావసధంబున విట్లు చెప్పందొడంగెను.

146 వ మజిలీ.

-♦ మతంగయోగినికథ. ♦-

గీ. అఱుతఁ గరములఁజెవుల రుద్రాక్షమాలి
    కలు వెలయ భూతమై పూతగానలంది
    దండకుండ్యజనంబులఁ దాల్చి సిద్ధు
    రాలొకర్తుక కాషాయచేల కలిత

పాటలీపుత్రనగర రాజమార్గంబున బోవుచుండ నయ్యోగినిం జూచి సాష్టాంగమెరగువారును జేతులుజోడించువారును దాసోహమనువారును నోరసిల్లిపోవువారునై బ్రజలు తద్రూపాటోపంబుజూచి తపస్సిద్ధురాలని తలంచి వెనువెంటఁ బోవుచుండిరి.

ఆమె వారివారి నమస్కారములుమాత్రమందికొ నియెవ్వరివంక జూడక యెవరితోమాటాడక తిన్నగా రతినూపురయింటికిఁ బోయినది సంతతము వీణగాన ముఖరితంబై యొప్పుచుండెడి యాయిల్లు నిశ్శబ్దంబై యుండుటకు వెఱగుపడుచు నాసిధ్ధురాలు ఢాకినీ నామస్మరణము గావింపుచు లోపలికిబోయినది.