పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిత్రసేనారతి మంజరులకథ.

83

యమున నీవేదికపైనున్నవానిఁ బతిగాఁజేసికొమ్మని దీనికొకదేశికుండుపదేశించెను. తదీయపురాకృత సుకృతవిశేషంబునం జేసి మిమ్మిందుఁ జూడఁగాంచినది. యభీష్టము ఫలించినది. మాకు మొదటనుండియుఁ బండితులఁ బతులగాఁ జేసికొనఁదలంపుగలిగియున్నది. మీరానతిచ్చిన మీమిత్రుఁడు దత్తకుఁడు నేను నొకబడిలోఁజదివికొంటిమి. ఆయనకుఁ జిన్నతనమునందే తల్లిచనిపోయినది. తండ్రియగు మాధురుండు దాను బెనుపలేక యొకయిల్లాలికిఁ బెంచుకొననిచ్చి యెందేని పోయెనట. అందులకే యాయనకాపేరువచ్చినదని యొకప్పుడు బడిలోఁ జెప్పికొనుచుండ వింటిని. పెంపుడుతల్లి వారినిఁజాల గారాముగాఁ బెనుచుచుఁ జదువులో మిగుల శ్రద్ధచేసినది.

నిత్యము బడివేళకు మాయింటికిఁ దీసికొనివచ్చుచుండునది. మే మిరువురము నాచిన్న త్రోపుడుబండిలో నెక్కి పాఠశాలకుఁ బోవుచుందుము మమ్ముఁజూచి రాచబిడ్డలవలెనుంటిమని చూపరులు మెచ్చుకొనుచుండిరి. దత్తుఁడు మిక్కిలి చక్కనివాఁడు నాకంటె రెండేండ్లు పెద్దవాఁడు. ఆయనను బావబావయనిపిలుచు దానను, నన్నుఁ బెండ్లామనిపిలుచుచు హాస్యములాడువాఁడు ఎప్పుడు కలిసి మెలిసి తిరుగువారము నేను వారింటికో యాయన మాయింటికో వచ్చుచుందుము. ఒకరి నొకరు చూడక క్షణమోర్వలేక పోవువారము.

ఆయన చిన్నబడివిడిచి పండితులయొద్ద శాస్త్రములు చదువుట కారంభించిన తరువాత మాస్నేహమున కంతరాయము రాఁజొచ్చినది. అప్పుడు మా చెల్లెలు పినతల్లియొద్ద నుండుట వారిస్నేహము దానికిఁ గలిగినదికాదు. ఆయనఁ గాశికిబోవునప్పుడు నేను గ్రామములోలేను. తరువాతవచ్చి చాల విచారించితిని స్నేహమునకు దూరములేదుగద నా స్వాంతమెప్పుడు వారిమీదనే యున్నది. నేనాయన పెండ్లియాడ నిశ్చయించుకొంటిని. మీరు దీనింబరిగ్రహించి మమ్ము వెంటఁబెట్టికొని