పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిత్రసేనారతి మంజరులకథ.

81

విని దత్తకనామాకర్ణనంబునం బెచ్చు పెరిగిన సంతోషముతో వచ్చి యచ్చెల్వుఁ జూచినది. అతండప్పుడు నగుమొగముతో బోఁటీ! నా మాట కుత్తరంబిచ్చితివికావు? ఈయిల్లెవ్వరిదని యడిగిన జిత్రసేన మందహాసము సేయుచు

క. అతను శరజూలధారా
   హతులం బరితృప్తులైన యధ్వగుల మనో
   రతుల వెతమాన్పు నియత
   వ్రతులీసదనాధిపతుల పత్రపులనఘా.

ఈపైదలి మదీయసోదరీరత్నంబు అభీష్టవరలాభంబపేక్షించి యిందువచ్చినది. ఈయుదయంబునఁ దొలుత సుముఖులగు మీముఖంబు జూచినది కామసిద్ధి తప్పక పడయగలదు. దీనిఁబరిగ్రహింపుఁడు. అనిపలుకుచుఁ జెల్లెలికిఁ గనుసన్నజేయుటయు నగ్గజయాన సిగ్గువిడిచి దిగ్గునఁ దదంతికంబునకుం బోయి తుంటవిల్కాని తూపులననోపు క్రేఁగంటి చూపుల నతనింసూచుచుఁ జేతనున్న పుష్పమాలిక సవరించుచు

క. మాలిక యిది నాహృదయము
   పోలిక మీడెంద మందుఁబొలు పొందెడు నా
   కేలిక గైకొనిరతి నా
   కేలికవగుమింక నాశ్రయింతుఁ గవీంద్రా.

అని పలుకుచు నాపూవుదండ నతని మెడలో వై చినది. అప్పు డతండు విభ్రాంతస్వాంతుఁడై యోహో! యీమోహనాంగి నీవే నాభర్తవని నామెడలో బుష్పదామంబువైచినది. ఇది స్వప్నమా? సత్యమా? నా మొగంబెఱుఁగని యిమ్మగువ యిట్లుచేయుటకుఁ గారణ మేమి? నేను మఱియొకండ ననుకొన్నదా? ఔరా ? స్త్రీమోహమెంత వింతయైనది. దృఢంబగు నాయంతరంగంబు తరంగమువలెఁ జంచలించుచున్నదే. ఔను.