పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

నట్లేకదా? వారికిఁజిత్రసేనయనియు రతిమం జరియనియుఁబేరులుపెట్టినది. త్రిజగన్మోహనరూపంబునఁ బ్రకాశించు నాబాలికలకుఁ గ్రమంబున సంగీత సాహిత్యాది విద్యలు నేర్పించినది. వీణాగాన పరిశ్రమలో భూలోకములో వారినిమించినవారు లేరని వాడుకవచ్చినది. బంగారమునకుం బరిమళమబ్బినట్లు ఆబిబ్బోకవతుల చక్కఁదనమును యౌవనము మెఱుఁగుబెట్టినది.

శ్లో॥ యౌవనే సత్వజాస్త్రిణా మలం కా రాస్తువింశతిః॥ యౌవన సంబంధములగు హావభావాద్యలం కారము లిరువదియు వారినలంకరించినవి తదీయ సౌందర్య విద్యావిశేషంబులఁ దెలిసికొని వారింజూడ వలయుననియు మాటాడవలయుననియు ననేక విటశిఖామణులు ప్రయత్నించిరి. కాని, వారట్టియవకాశమీయక రాజస్త్రీలవలె నంతఃపురముననే మెలఁగుచుందురు.

యౌవనవతులగు పుత్రికల నిర్వుర వేశ్యావృత్తిలో బ్రవేశపెట్టిధనమార్జింపవలయునని తలంచి యొకనాఁడు రతినూపురతనపుత్రికలకు వైశికధర్మము లిట్లు బోధించినది. బిడ్డలారా! మీరు మనోహర రూపవిద్యాననవద్యలై యొప్పుచున్నారు. మీనిమిత్తమైవిత్తేశునివంటి యాఢ్యులు బడికాపులై తిరుగుచున్నారు. మీరు వేశ్యాధర్మముల నాక్షేపించుచు విటుల మొగము జూడక కులస్త్రీలవలె నొదిగియొదిగి మెలఁగుచున్నారు. వైశికప్రకరణమొకటిమన నిమిత్తమై విద్వాంసులచే వ్రాయఁబడినది. దాని మీకుపదేశింతు. అంతయు చెప్పువఱకు నట్లిట్లని శంకజేయక వినుండు.

కాముకులకు శరీరమిచ్చి యర్ధార్జనముచేయుట వేశ్యాకుల ధర్మమై యున్నది. కులస్త్రీలు రాగాసక్తలు. వేశ్య లర్థాసక్తులు. గణిక, రూపాజీవ, కుంభదాసి యని వేశ్య మూఁడువిధముల నొప్పుచున్నది. దేవగృహతటాకాది పుణ్యకార్యంబులు చేయుచు నొక్కనినే