పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రత్నవర్తకులకథ.

67

యతండు భార్యతో నే నూరికి బోయి సాయంకాలమునకుఁ దప్పక వచ్చెద నింటిలో జాగ్రతగానుండుమీ యనిచెప్పి యదిచూచుచుండ నవ్వలికిఁబోయి వేరొకమార్గంబున లోపలికివచ్చి పడకటింటియటుకపై గూర్చుండెను.

జారయుఁ బెందలకడభోజనముజేసి శయనగృహమునకుఁబోయి మంచముపై గూర్చుండి రవిక నూడదీసి హృదయాంతరము గ్రుద్దుచు పాడుహృదయమా! నారహస్యములన్నియు వెల్లడింతువా? నాకంటె నీకాయనదగ్గిరచుట్టమా? నిన్నేమిచేయుదునే చూడుము? ఇంకొకసారి చెప్పినఁ జీల్చిపారవేయుదును. నాప్రౌఢిమ యెఱుఁగవుగాక యని, పది గ్రుద్దులుగుద్దినది. తనకేనొప్పివెట్టినది. ఇఁకబుద్ధిరాఁగలదని నిశ్చయి౦చి వెండియు రవికతొడుగుకొని గృహకృత్యములు గావించుకొనుచుండెను.

గోమఠుండెట్లో భార్యకుఁదెలియకుండ నిలుదాటి యూరినుండి వచ్చినట్లు సాయంకాలమున నింటికివచ్చెను. భార్య పెందలకడ వంటజేసి భోజనముపెట్టినది. క్రీడాదియందు వెండియు నతండామదవతి హృదయంబునఁ జెవినిడి ఆ ఆ. ఏడ్చెదవేమి? ఊరుకో ఏమిచేసినదో చెప్పుము. నిన్ను గట్టిగా గ్రుద్దినదా? నాతోఁ దనరహస్యము చెప్పినందులకా ? ఆ. ఏమన్నది ? నాకంటె ఆయనదగ్గిరచుట్టమా ! అనినదీ ఇఁక జెప్పితివేని చీల్చి పారవేసెదనని గ్రుద్దినదా! ఊ తరువాత, నొవ్వ గ్రుద్దినదేమి? బాధగానున్నదా? కానిమ్ము మందలింతునులే. ఊరుకో. నీ కేమిభయములేదు. అని యభినయించి పలుకుచుండ జారభయపడుచు “నిఁక దీనిముందర నారహస్యములు నిలువవు. చేసినపని చెప్పకమానదు.” అనితలంచి యతండుదండిపఁబోవఁ బాదంబులఁబడి యింకెన్నడు తప్పుచేయను. చేసితినేని హృదయమే చెప్పునుగదా? ఈసారిపరీక్షించి చూడుఁడు మీరుచేసిన శిక్షకుఁ బాత్రురాలనగుదునని శపథము